హెచ్ఎండీఏ కమిషనర్ గా టి. చిరంజీవులు..?

by Shyam |   ( Updated:2020-11-04 03:28:55.0  )
హెచ్ఎండీఏ కమిషనర్ గా టి. చిరంజీవులు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో :
హెచ్ఎండీఏ కమిషనర్ గా టి. చిరంజీవులు తిరిగి రానున్నారు. హెచ్ఎండిఏ గాడి తప్పిందని, ఇక్కడ ఆర్థిక, ప్లానింగ్, ఇంజనీరింగ్, ఎస్టేట్ విభాగాలు సమర్థవంతంగా పనిచేయడంలేదు. ఫలితంగా సంస్థ పరిపాలనా వ్యవహారాలు అస్తవ్యస్తంగా మారినట్టు గ్రహించిన పురపాలక శాఖ సంస్థను గాడిలో పెట్టేందుకు చిరంజీవులు కమిషనర్ గా పంపించాలని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు యోచిస్తున్నట్టు సంస్థ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆయన కమిషనర్ గా వచ్చిన తర్వాతనే సంస్థ ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు రుణాలను చాలా వరకు తీర్చినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ మేడ్చెల్ కూడలి కండ్లకోయ సమస్యను, ఓఆర్ఆర్ లో భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపుతో పాటు వారికి కోహెడలో 100 ఎకరాల లేఅవుటు అభివృద్ది, ఉప్పల్ భగాయత్ లో 413.31 ఎకరాల్లో లేఅవుట్ చేసి భూములు అందజేసిన వారికి ప్లాట్లను కేటాయించేలా చేశారు. సంస్థకు ఐటి శాఖ నుంచి ఎదురవుతోన్న సవాళ్ళను అధిగమించేలా చర్యలు తీసుకున్నారు. జవహార్ నగర్ ప్రాంతంలోని అథారిటీ భూములపై ఉన్న కేసుల్లో విజయం సాధించేలా కృషిచేసిన చిరంజీవులును మరల హెచ్ఎండీఏకు కమిషనర్ గా నియమించాలని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ భావిస్తున్నట్టు అధికారులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పథకాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.

కార్యరూపంలోకి పథకాలు..

బాలానగర్ ఫ్లైఓవర్, మంగళ్ పల్లిలో ట్రక్ పార్కు నిర్మాణం, సంజీవయ్య పార్కులో సీతాకొక చిలుకల పార్కు, భారీ జాతీయ పతాకం నిర్వహణ, శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 100 కోట్లకు పైగా చిరంజీవులు కేటాయించారు. అథారిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలను నివారించేందుకు ప్రత్యేకంగా నెల రోజుల పాటు డ్రైవ్ ను ఆయన చేపట్టారు. అనంతరం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టి చర్యలు తీసుకున్నారు. కొత్వాల్ గూడలో నైట్ సఫారీ, హిమాయత్ సాగర్ సుందరీకరణ పనులు ఆయన కాలంలోనే ప్రతిపాదించడం జరిగిందని భావించిన పురపాలక శాఖ అథారిటీకి పంపించాలని భావిస్తున్నట్టు కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. 2015లో వచ్చిన ఎల్ఆర్ఎస్ లో వచ్చిన దరఖాస్తులను సమయానుకూలంగా పరిష్కరించడం ద్వారా సుమారు రూ. 600 కోట్లు ఆదాయం చేకూర్చేలా చర్యలు తీసుకున్నారని ఆయనకు పేరుంది. అథీరిటీ పరిధిలో సంస్థకు చెందిన పనికిరావని వదిలేసిన ప్లాట్లను వేళం వేసి సుమారు రూ. 400 కోట్లు సంస్థకు ఆదాయం చేకూర్చడంతో పాటు ప్లానింగ్ లో వేగంగా పనులు జరిగేందుకు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈఓడిబి), డెవలప్‌మెంట్ ఆఫ్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం(డిపిఎంఎస్) సాంకేతిక పరిజ్ఞానాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చిన చిరంజీవులును హెచ్ఎండిఎకు కమిషనర్ గా పంపించాలని మంత్రి కెటిఆర్ భావించారని అధికారులు వెల్లడిస్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవులు..

హెచ్ఎండీఏ కమిషనర్ నుంచి రిజిస్ట్రేషన్ విభాగానికి ఐజీఅండ్ కమిషనర్ గా బదిలీపై వెళ్ళారు. అక్కడ రెండేండ్లు పనిచేసిన అనంతరం ప్రస్తుతం పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. ఆయన బదిలీపై వెళ్ళిన అనంతరం హెచ్ఎండీఏకు కమిషనర్ గా బి. జనార్థన్ రెడ్డి కొద్ది కాలం పనిచేసిన ఆయనను ఆరు నెలల్లోనే బదిలీ చేసింది ప్రభుత్వం. తర్వాత పూర్తిస్థాయి అధికారులు రాలేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అరవింద్ కుమార్ కు చాలా బాధ్యతలు అదనంగా ఉన్నందున, పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న చిరంజీవులును హెచ్ఎండీఏకు కమిషనర్ గా పంపించనున్నట్టు సమాచారం. అథారిటీ వర్గాలు కూడా ఆయన వస్తేనే హెచ్ఎండీఏ పరిపాలనా వ్యవహారాలు, అభివృద్ది పథకాలు గాడిలో పడుతాయని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed