ఆశ్చర్యాన్ని కలిగించే ఆలయం మహా అద్భుతం.. చూసొద్దాం రండి..!

by Anukaran |
ఆశ్చర్యాన్ని కలిగించే ఆలయం మహా అద్భుతం.. చూసొద్దాం రండి..!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: మేళ్లచెర్వు మండల కేంద్రంలో స్వయంభుగా వెలిసిన శంభులింగేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడి శివలింగం ప్రతి పుష్కరకాలానికి ఒక అంగుళం ఎత్తు పెరుగుతుంది. దీనికితోడు నిత్యం శివలింగంపైన ఉండే రంధ్రం నుంచి నీళ్లు జాలువారుతుంటాయి. ఈ జలం తాగినా.. తలపై చల్లుకున్నా.. ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అయితే మహాశివరాత్రి ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తజనం తరలివస్తుంటారు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రభలు ఏర్పాటు చేయడం హైలెట్‌. మహాశివరాత్రి సందర్భంగా మేళ్లచెర్వు శివాలయంపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెర్వు మండల కేంద్రంలో స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. అర్ధనారీశ్వర రూపంలో పార్వతీదేవి అమ్మవారి జడ ఆనవాళ్లు శివలింగం వెనుకభాగంలో ఇక్కడ చూడొచ్చు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయం నిర్మించారు. 1233వ సంవత్సరంలో ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడి రాతి శివలింగం ఎత్తు ఐదు అడుగులు.

ఐదు రోజుల పాటు ఉత్సవాలు

మహాశివరాత్రి జాతర సందర్భంగా ఐదు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముందు రోజు గ్రామంలో ప్రభను ఊరేగించి శివరాత్రి రోజున ఆలయ ప్రాంగణంలో ఉంచి సంప్రదాయ నృత్యాలు నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి స్వామి వారి కల్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ సారి 8 ప్రభలను ఏర్పాటు చేయనున్నారు. టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, రెడ్డి, ఖమ్మ, కాపు, ఎస్సీ తదితర కమ్యూనిటీల వారీగా ప్రభలను నిర్వహిస్తుండడం గమనార్హం.

ఎద్దుల పందేలు, కబడ్డీ పోటీలు..

జాతరలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఎద్దుల పందేలు, కబడ్డీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒంగోలు, గుంటూరు ప్రాంతం నుంచి ఎద్దులు ఇక్కడ పందాల్లో పాల్గొనేందుకు రైతులు తీసుకొస్తారు. ఈ సంవత్సరం రూ.5 లక్షల విలువ చేసే ట్రాక్టర్ మొదటి బహుమతిగా ఉంచడంలో పెద్ద సంఖ్యలో ఎడ్లు వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు స్థానిక యువకులు రాష్ట్ర స్థాయి కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంటు నిర్వహిస్తారు. క్రీడాపోటీలకు పెద్దఎత్తున జనం తరలివస్తారు.

Advertisement

Next Story