ఆ శాఖలో ‘అవినీతి’కే పట్టం.. ఇది ప్రమోషనా.. పనిష్మెంటా..?

by Shyam |   ( Updated:2021-08-21 08:19:34.0  )
dichapalli
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ‘నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు’ అన్న చందంగా తయారైంది రాష్ట్ర వైద్యశాఖ ఉన్నతాధికారుల తీరు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన ఘటనలో ఒక ఉద్యోగికి బహుదూరంగా.. మరో ఉద్యోగికేమో ‘పదోన్నతి’ కల్పించిన్నట్టు ఏకంగా జిల్లా ఆసుపత్రికి నియామక ఉత్తర్వులు అందజేసి తమ ‘నిజాయితీ’ని నిరూపించుకున్నారు రాష్ట్ర వైద్యశాఖ అధికారులు.

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఇద్దరు ఉద్యోగులు రోగుల దగ్గర డబ్బులు వసూలు చేయడంతో పాటు ప్రభుత్వం తరఫున డెలివరీ అయిన మహిళలకు అందించే సాయాన్ని మాయం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై గత మార్చి నెలలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సీరియస్ అవ్వడమే కాకుండా జిల్లా వైద్యశాఖ యంత్రాంగంతో విచారణ చేయించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని అదే నెలలో సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఐన ఇద్దరిలో ఒకరికి పనిష్మెంట్‌లో భాగంగా సాలుర ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే, మరో మహిళా ఉద్యోగస్తురాలికి మాత్రం పనిష్మెంట్‌లా కాకుండా.. ఉద్యోగి పని(ధన)తనం వైద్యశాఖ ఉన్నతాధికారులకు నచ్చి ఆమె కోరుకున్న స్థానమైన నిజామాబాద్ జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)కు అనగా గతంలో ఉన్న పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయి కంటే ఎక్కువ సర్వీసులు ఉన్న స్థానంలోకి బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా, రాష్ట్ర స్థాయి వైద్య శాఖ కార్యాలయం పనితీరు పట్ల జిల్లా వైద్యశాఖలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన ఉద్యోగస్తురాలికి పనిష్మెంట్ కాకుండా ప్రమోషన్ ఇచ్చారని.. అందుకోసం వారు ఎంతమేరకు ప్రతిఫలాలు అందుకున్నారో అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరి ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story