సూర్యాపేట అష్టదిగ్బంధనం

by Shyam |
సూర్యాపేట అష్టదిగ్బంధనం
X

దిశ, న‌ల్ల‌గొండ‌: కాంటాక్ట్‌ కరోనా భయం సూర్య‌ాపేట‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. కరోనా కాంటాక్ట్‌ పెరిగి పాజిటివ్‌ కేసులు జిల్లాలో బ‌యటపడుతున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం ఈ కాంటాక్ట్‌ కరోనాను నియంత్రించేందుకు ముప్పుతిప్పలు పడుతోంది. ఇళ్ల నుంచి జ‌నం బ‌య‌ట‌కు రాకుండా సూర్య‌ాపేట‌ను అష్ట‌ దిగ్బంధనం చేశారు. రెడ్‌జోన్‌గా ప్ర‌క‌టించిన పేట‌లో ఇక ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేవారిని ఉపేక్షించ‌కుండా క్వారంటైన్‌కు త‌ర‌లించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ వినయ్ కృష్ణారెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రోడ్ల‌పైకి జ‌నం రావడాన్ని పూర్తిగా నిషేధించారు. ఒకే రోజు కాంటాక్ట్ పాజిటివ్ కేసులు 11 మందికి నిర్ధార‌ణ కావ‌డంతో అధికారులు అందోళన చెందుతున్నారు. కూర‌గాయల మార్కెట్‌లోని 8 మందికి పాజిటివ్ గా నిర్ధార‌ణ కావడంతో వారితో కాంటాక్ట్ అయిన వారి కోసం వేట సాగిస్తున్నారు. ఆదివారం కూర‌గాయల మార్కెట్ నుంచి ప‌లువురిని క్వారంటైన్‌ల‌కు త‌ర‌లించి ర‌క్త నమూనాలను సేక‌రించారు. క‌రోనా పాజిటివ్ కేసుల్లో ఉమ్మ‌డి జిల్లాలో న‌ల్ల‌గొండ‌ను సూర్య‌ాపేట మించిపోయింది.

ఒక వ్య‌క్తి నుంచి 19 మందికి..

ఢిల్లీ మ‌ర్క‌జ్‌కు వెళ్లొచ్చిన ఓ వ్య‌క్తికి సూర్య‌ాపేట జిల్లా కేంద్రంలో ఈ నెల మొద‌టి వారంలో క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ నెల 18న ఢిల్లీ నుంచి వ‌చ్చిన త‌రువాత కుడకుడకు చెందిన ఆ వ్య‌క్తి ఎక్క‌డెక్క‌డ తిరిగాడ‌న్న‌దానిపై అధికారులు విచార‌ణ సాగించారు. కుడ‌కుడ‌ను రెడ్‌జోన్‌గా ప్ర‌క‌టించారు. అయితే.. ఢిల్లీ నుంచి వ‌చ్చిన అత‌ను త‌న బంధువులైన నాగారం మండ‌లం వ‌ర్ధమానుకోట‌కు వెళ్ల‌డంతో ఆ ఇంటిలో ఆరుగురికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. వీరు వ్య‌వ‌సాయ ప‌నుల నిమిత్తం ప‌రిస‌ర గ్రామాల‌కు వెళ్లారు. యాదాద్రి జిల్లా అడ్డ‌గూడూరు మండ‌లం కోట‌మ‌ర్తి, సింగారం, ల‌క్ష్మీదేవికాల్వ‌, జాన‌కిపురం గ్రామాల‌కు వెళ్ల‌డంతో వారిని క‌లిసిన సుమారు 155 కుటుంబాల‌ను హోం క్వారంటైన్ చేశారు. ఆ త‌రువాత కూర‌గాయల మార్కెట్‌లో కిరాణ దుకాణం న‌డుపుతున్న వ్య‌క్తికి అత‌ని ద్వారానే క‌రోనా నిర్ధార‌ణ కావ‌డంతో ఆయ‌న నివసిస్తున్న కొత్త‌గూడెం కాల‌నీని రెడ్‌జోన్‌గా ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత అత‌ను సంచ‌రించిన ప‌ట్ట‌ణంలోని 15 వార్డుల‌ను రెడ్‌జోన్‌లోకి తీసుకువెళ్లారు.

ప‌ల్లెలకు పాకిన క‌రోనా…

సూర్య‌ాపేట కుడకుడకు చెందిన వ్య‌క్తి ద్వారా ఇప్పుడు క‌రోనా ప‌ల్లెలకు పాకింది. ఆయ‌న‌తో స‌న్నిహితంగా ఉన్న‌టువంటి నేరేడుచ‌ర్ల‌, తిరుమ‌ల‌గిరిలో ఒకొక్క‌రికి క‌రోనా నిర్ధార‌ణ కావ‌డంతో వారిని హైద‌రాబాద్‌కు త‌ర‌లించించి వారి కుటుంబ స‌భ్యుల‌ను సూర్య‌ాపేట ప్ర‌భుత్వ క్వారంటైన్‌కు త‌ర‌లించారు. వారి నుంచి ఈ క‌రోనా ఇంకెంత మందికి సోకుతుందోనని అధికార యంత్రాగం ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ది. గ్రామాల్లో వ్య‌వ‌సాయ ప‌నుల‌కు లాక్‌డౌన్‌ను స‌డ‌లించారు. దీంతో గ్రామాల్లో సామాజిక దూరం పాటించ‌కుండానే ఇరుగు పొరుగువారు క‌లిసి తిరుగుతున్నారు. వ్య‌వ‌సాయ ప‌నుల‌కు వెళ్లిన వ‌ద్ద భోజ‌న స‌మ‌యాల్లో సామూహికంగా క‌లిసి తింటున్నారు. ఒక‌రి కూర‌లు మ‌రొకరు వేసుకోవ‌డం గ్రామాల్లో అల‌వాటు. ప‌ని చేసే చోట వీరు ఎంతమందిని స్ప‌ర్శించారోనని లెక్క‌లు తీస్తున్నారు. ప‌ట్ట‌ణాల్లో ఇళ్ల నుంచి జ‌నం బ‌య‌ట‌కు రాకుండా క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చు. కానీ, గ్రామాల్లో క‌ట్ట‌డి చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని అని పోలీసులు చెబుతున్నారు.

36 మంది రిపోర్టులు పెండింగ్‌

కుడ‌కుడకు చెందిన ఒక వ్య‌క్తికి క‌రోనా రావ‌డం వ‌ల్ల‌ కాంటాక్ట్ పాజిటివ్ కేసులు మ‌రో 19 మందికి బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 206 మందికి ర‌క్త ప‌రీక్ష‌లు చేయ‌గా 170 మంది రిపోర్టులు వ‌చ్చాయి. ఇందులో 150 మందికి నెగెటివ్ రాగా మ‌రో 36 మంది ర‌క్త ప‌రీక్ష‌ల ఫ‌లితాలు రావాల్సి ఉన్న‌ది. పాజిటివ్‌ కేసులు వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారి నమూనాల ఫలితాలు ల్యాబ్‌ నుంచి ఎలా వస్తాయోనని అందరిలో టెన్షన్‌ మొదలైంది. అనుమానితులుగా భావిస్తున్న 128 మందిని ఇంకా ప్ర‌భుత్వ క్వారంటైన్‌లో ఉంచారు. మ‌రో 573 మందిని హోం క్వారంటైన్ చేశారు. శ‌నివారం అర్ధ‌రాత్రి ఒక్కసారిగా 11 మందికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ కావ‌డంతో వారికి సంబంధించినవారి కోసం అధికారులు ఆదివారం వేట మొదలుపెట్టారు. దీంతో వారు నివాసాలున్న ప్రాంతాలను జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు… దిగ్బంధించారు. ఆయా ప్రాంతాల్లో జనసంచారం లేకుండా రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీసులు ఆయా ప్రాంతాల్లో పహారా కాస్తూ రాకపోకలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టారు. కాగా, 92 వైద్య బృందాలు రంగంలోకి దిగి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన వారితో సంబంధాలు ఉన్నవారి కోసం వేట మొదలు పెట్టారు. వారు ఎక్కడ ఉన్నారు? వారితో కలిసి ఉన్నవారెవరూ, కుటుంబసభ్యులు వారు ఇతరులతో కలిసి సాగారా… తదితర వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే వీరికి సన్నిహితంగా ఉన్న పలువురిని గుర్తించి వారిని క్వారంటైన్‌లకు తరలించారు. వ్యాధి నిర్ధారణ కోసం నమూనాలను తీసి ల్యాబ్‌కు పంపించినట్లు తెలిసింది.

జిల్లాలో కరోనా డేంజర్‌ బెల్

క‌రోనా అంటువ్యాధి కావడంతో సన్నిహితంగా మెలిగినవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు కరోనా పాజిటివ్‌ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని యంత్రాంగం టెన్షన్‌ పడుతోంది. ఒకవేళ కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపైనా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్‌ ఆయా శాఖలను అప్రమత్తం చేస్తున్నారు. వైద్యశాఖ, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ శాఖలు నియంత్రణ చర్యల్లో మునిగితేలారు. జ‌నాలు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని ఆంక్ష‌లు విధించారు. ప్ర‌స్తుతం మొబైల్ వాహ‌నాల యంత్రాల ద్వారా అత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌ను డోర్‌ డెలివ‌రీ చేయ‌డానికి సంసిద్ధుల‌య్యారు. ఇక‌ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే వారిని నిర్దయ‌గా ఇమాంపేట హోం క్వారంటైన్‌కు త‌ర‌లించాల‌ని క‌లెక్ట‌ర్ పోలీసుల‌కు అదేశాలు జారీ చేయ‌డం అక్క‌డ ప‌రిస్థితి తీవ్ర‌త అర్ధ‌మవుతున్న‌ది.

tags: Suryapet, Collector, Positive, Corona, Danger Bell, Door Delivery, Delhi Markaz

Advertisement

Next Story