ఎంట్రన్స్ పరీక్షలను ‘మనునీతి’తో పోల్చిన సూర్య!

by Jakkula Samataha |
ఎంట్రన్స్ పరీక్షలను ‘మనునీతి’తో పోల్చిన సూర్య!
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది పిల్లలకు విద్యాదానం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసందే. అయితే తమిళనాడులో ‘నీట్’ ఎంట్రన్స్ టెస్ట్ రాసేందుకు భయపడి, ముగ్గురు పిల్లలు చనిపోవడం తనను ఆవేదనకు గురిచేసింది. ఈ క్రమంలోనే.. పిల్లల జీవితాలను చిదిమేస్తున్న ఇలాంటి ఎంట్రెన్స్ పరీక్షలకు పరిష్కారం చూపలేమా? అంటూ నోట్ రిలీజ్ చేశాడు సూర్య.

కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పిల్లలు తమను తాము నిరూపించుకునేందుకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు సూర్య. వీటిని మనునీతి పరీక్షలుగా అభివర్ణించిన ఆయన.. ఇవి విద్యార్థుల అవకాశాలను మాత్రమే కాదు, వారి జీవితాలను కూడా లాక్కొంటున్నాయని అన్నారు. ఇలాంటి పరీక్షా వ్యవస్థ కారణంగా అన్యాయంగా పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు ఇది జీవితకాలపు శిక్ష కాదా? అని ప్రశ్నించారు. ప్రజల్లో అసమానతలను ఎత్తి చూపే చట్టాలపై మండిపడిన సూర్య.. పేదలు, అణగారిన వర్గాల వాస్తవికత గురించి తెలియని వారే ఇలాంటి విద్యావిధానాలను రూపొందించారని అన్నారు.

విజయాలు, అపజయాలను ఎదుర్కొనేందుకు పిల్లలను ప్రిపేర్ చేయాలని.. కుటుంబం, బంధాల కన్నా పరీక్షలు ఎక్కువేమీ కాదనే ఆలోచన పిల్లల్లో పెంచేందుకు తల్లిదండ్రులు, గురువులు ప్రయత్నించాలన్నారు. కానీ ఏం జరుగుతోంది? మహాభారతంలో ద్రోణుడు ఏకలవ్యుడి బొటనవేలిని గురుదక్షిణగా అడిగితే.. లేటెస్ట్ గురువులు ఆరో తరగతి పాస్ అయిన విద్యార్థులను నీట్ లాంటి ఎంట్రన్స్ పరీక్ష పాసై తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని కోరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమాజంలో ఉన్న మనం అప్రమత్తంగా లేకుంటే విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయన్న సూర్య.. నీట్‌కు వ్యతిరేకంగా గళం విప్పాలని కోరారు. ఇది సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థుల వైద్యవృత్తి కలలకు నిప్పు పెడుతుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed