‘ఫ్యాన్స్ బీ రెడి ధోని వస్తున్నాడు’

by Anukaran |   ( Updated:2020-08-07 10:41:35.0  )
‘ఫ్యాన్స్ బీ రెడి ధోని వస్తున్నాడు’
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచకప్‌-2019లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని మళ్లీ భారత జట్టులో కనబడనేలేదు. అప్పట్నుంచీ క్రికెట్ అభిమానులందరూ ధోని మళ్లీ మైదానంలో ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అంటూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 14నెలల తర్వాత మిస్టర్ కూల్‌ మళ్లీ తన హెలికాప్టర్ షాట్లతో అలరించనున్నాడు.

దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన స్వస్థలమైన రాంచీలో నెట్స్‌లో ధోనీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.

‘గతవారం జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియం కాంప్లెక్స్‌కు మహీ వచ్చాడు. ఇండోర్‌ స్టేడియంలో బౌలింగ్‌ మెషిన్‌ను ఉపయోగించి ప్రాక్టీస్ చేశాడు. అయితే, ధోని ప్రణాళికలు ఏమిటో, అతను మళ్లీ ఇక్కడికి వస్తాడో రాదో తెలియదు. ప్రాక్టీస్ కోసం ఇక్కడికి రావడంతోనే ఆ విషయం మాకు తెలిసింది. రెండు రోజులు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు కాని అప్పటి నుండి మళ్లీ ఇక్కడికి రాలేదు. అయితే ప్రాక్టీస్ కోసం ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చాడు కావొచ్చు’ అని ఒక అధికారి పేర్కొన్నారు. కాగా, ఐపీఎల్‌ లీగ్‌ ఆరంభం నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని మూడు టైటిళ్లు అందించి సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు.

ఇదిలా ఉండగా, ఐపీఎల్‌లో మహీ ఆడబోతున్నాడనే విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా సూచనప్రాయంగా తెలియజేస్తూ.. యూఏఈలో జరగబోయే ఐపీఎల్ 13వ సీజన్ కోసం ధోనీ అభిమానులు సిద్ధంగా ఉండాలని అన్నాడు. కరోనా వ్యాప్తికి ముందు తాను మహీతో ఉన్నానని, ఆ సమయంలో అతను చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాడని చెప్పాడు. దీంతో త్వరలో జరగనున్న ఐపీఎల్‌లో తమ సారథి నుంచి అత్యుత్తమ ప్రదర్శనతోపాటు, హెలికాప్టర్ షాట్లూ ఆశించొచ్చని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed