మండలి ఛైర్‌పర్సన్‌గా వాణిదేవి.. సాగర్ నుంచి గుత్తా పోటీ?

by Anukaran |
vanidevi, gutha
X

దిశ, తెలంగాణ బ్యూరో: శాసనమండలి ఛైర్‌పర్సన్‌గా వాణిదేవిని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఛైర్మన్ ఎన్నిక అనివార్యమవుతోంది. ఆ స్థానంలో వాణిదేవిని ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకునే అవకాశం ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ వర్గాల్లో ఆమెకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్నందున గుత్తా సుఖేందర్ రెడ్డికి అక్కడి నుంచి పోటీచేసేలా పార్టీ అధిష్టానం అవకాశం కల్పించవచ్చన్న వార్తలు కూడా ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

చట్టసభల్లో ఆమెకు ఎలాంటి పూర్వానుభవం లేనప్పటికీ ఛైర్‌పర్సన్ బాధ్యతలను కట్టబెట్టడంలో ఇబ్బందేమీ ఉండదని పార్టీ భావిస్తోంది. ఒక ఎన్జీవో నేతగా ఉన్న స్వామిగౌడ్‌ను సైతం గతంలో ఎలాంటి అనుభవం లేకున్నా చైర్మన్‌గా నియమించిన ఉదాహరణను ఇప్పుడు పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఆ తీరులోనే ఇప్పుడు వాణిదేవికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వని గౌరవాన్ని టీఆర్ఎస్ ఇచ్చిందంటూ చెప్పుకునేలా త్వరలో మండలి ఛైర్మన్‌గా నియమించే అవకాశం ఉంది.

దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆ పార్టీ కంటే టీఆర్ఎస్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ పొలిటికల్ మైలేజీ పొందే ప్రయత్నాలను గతేడాది ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఆయన నిలువెత్తు తైలవర్ణ చిత్రపటాన్ని పెట్టే ఏర్పాట్లు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసే అవకాశాన్ని ఆయన కుమార్తె వాణిదేవికి కల్పించి గెలిపించుకుంది. ఇక్కడితోనే ఆగకుండా ఆమెను శాసనమండలి ఛైర్‌పర్సన్‌గా చేసి పీవీ కుటుంబం నుంచి మరొకరికి కూడా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చి గౌరవాన్ని కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed