ఐటీ యాక్ట్: కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం ఫైర్

by Shamantha N |   ( Updated:2021-07-05 11:39:31.0  )
supreme court
X

న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం సుప్రీంకోర్టు రద్దుచేసిన ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ ఇప్పటికీ అమలవుతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్రానికి నోటీసులు జారీచేసింది. సామాజిక మాధ్యమాల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర, ఇబ్బందికర, అవమానం కలిగించే విధమైన కంటెంట్‌ను పోస్ట్‌ చేసినవారిని అరెస్ట్ చేసేందుకు సమాచార చట్టంలోని సెక్షన్‌ 66ఏను ఉపయోగించేవారు. ఈ సెక్షన్ కింద నిందితులకు మూడేళ్లపాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే, దీనిని కొందరు పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో సెక్షన్ 66ఏను 2015లో సుప్రీంకోర్టు రద్దు చేసింది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలన్నీ తమ పోలీసులకు సమాచారమివ్వాలని ఆదేశించింది. అయినప్పటికీ ఇంకా పలు చోట్ల పోలీసులు సెక్షన్‌ 66ఏ కింద కేసులు నమోదు చేస్తుండటంపై పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌(పీయూసీఎల్) అనే మానవ హక్కుల సంస్థ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 66ఏను రద్దుచేసిన తర్వాత కూడా ఈ సెక్షన్ కింద వెయ్యికిపైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని, దీనిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘ఇది చాలా దారుణం. షాకింగ్ పరిణామం. రద్దయిన సెక్షన్ కింద వెయ్యికి పైగా కేసులా’ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై రెండువారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కాగా, 2015 మార్చిలో రద్దయిన సెక్షన్ 66ఏ కింద ఇప్పటివరకు 1,307 కేసులు రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది

Advertisement

Next Story

Most Viewed