‘ఒకే దేశం.. ఒకే రేషన్’ తప్పనిసరి

by Shamantha N |   ( Updated:2021-06-11 12:14:33.0  )
‘ఒకే దేశం.. ఒకే రేషన్’ తప్పనిసరి
X

న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు స్కీమ్‌ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని ద్వారా వలస కార్మికులకు లబ్ది చేకూరుతుందని వివరించింది. ఈ పథకం ద్వారా పనిచేసే రాష్ట్రంలో రేషన్ కార్డు లేకున్నా వలస కార్మికులు చౌక ధరల దుకాణం ద్వారా ధాన్యం తీసుకోగలరు. అసంఘటితరంగ కార్మికుల వివరాలు నమోదు చేయడంలో జాప్యమెందుకనీ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.

రేషన్ కార్డులేని కార్మికులకు ఈ ఏడాది నవంబర్ వరకు పొడిగించిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనా పథకం కింద ధాన్యం ఎలా అందుతుందని ప్రశ్నలు వేసింది. వలస కార్మికుల జీవితాలు ఛిద్రమవుతున్నాయని, నేడు వారి మరింత సంక్షోభంలోకి కూరుకుపోతున్నారని, కాబట్టి, వారికి ఆహార భద్రత, నగదు బదిలీ, రవాణా సదుపాయాలు, ఇతర సంక్షేమ చర్యలను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాల్సిందిగా హర్ష్ మందర్ సహా కొందరు కార్యకర్తలు పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎంఆర్ షాల వెకేషన్ బెంచ్ విచారిస్తున్నది.

ఢిల్లీ, చత్తీస్‌గఢ్, అసోంలాంటి కొన్ని రాష్ట్రాలు ఇంకా ఒకే దేశం, ఒకే రేషన్ పథకాన్ని అమలు చేయడం లేదని ఎస్‌జీ తుషార్ మెహెతా కోర్టుకు తెలిపారు. ఢిల్లీ కౌన్సెల్ వెంటనే కలుగజేసుకుని ఢిల్లీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని తెలుపగా, పశ్చిమ బెంగాల్ కౌన్సెల్ మాత్రం ఆధార్ నెంబర్లు అనుసంధానం చేయడంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఈ పథకాన్ని తప్పక అమలు చేయాలని స్పష్టం చేసింది. ఏ రాష్ట్రంలోనైనా రేషన్ తీసుకునేలా వలస కార్మికులకు లబ్ది చేకూరుతుందని ధర్మాసనం పేర్కొంది.

కాగా, అసలు రేషన్ కార్డే లేని వలస కార్మికులు వివిధ సంక్షేమ పథకాల కింద రేషన్ అందుతుందా? అని ప్రశ్నించింది. వాటినెలా పొందగలరు? అని అడిగింది. అసంఘటిత రంగ కార్మికుల డేటా తయారుచేయడానికి జాప్యమెందుకు అవుతున్నదని, వీరి డేటా తయారుచేసే సాఫ్ట్‌వేర్ డెవలప్‌చేయడానికి ఇంత కాలమెందుకు పడుతున్నదని, సర్వేలేమీ చేయడం లేదు కదా, ఎందుకంతా సమయం అని పేర్కొంది. మూడు రోజుల్లో వీటిపై వివరాలు సమర్పించాలని అన్ని పార్టీలను ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed