‘మిడ్ డే మీల్స్ స్థానంలో సరుకులు అందించాలి’

by Shyam |

దిశ, హైదరాబాద్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారిని అరికట్టే చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడిన నేపథ్యంలో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం స్థానంలో సరుకులను ఇంటింటికీ సరఫరా చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు బి.అచ్యుతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో సోమవారం ఆయన ప్రత్యేక పిటీషన్‌ను దాఖలు చేశారు.

మార్చి 23 నుంచి లాక్ డౌన్ కొనసాగిస్తున్నారనీ, ప్రస్తుతం ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో లాక్ డౌన్ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుతో పాటు ప్రభుత్వ పాఠశాలలో అందించే సమతుల్య ఆహారం (మధ్యాహ్న భోజనానికి) దూరమయ్యారని అన్నారు. తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందజేస్తున్నా.. ఎదిగే దశలో పిల్లలకు కావాల్సిన పౌష్టికాహారానికి దూరమై చాలీ చాలని ఆహారంతో రోజులు గడుపాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు ఉపాధి లేకపోవడంతో ప్రభుత్వం ఇస్తున్న బియ్యంతో సరిపెట్టుకుని అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారని చెప్పారు. కొవిడ్ మహమ్మారి తీవ్రత ఇప్పట్లో తగ్గేలా లేనందున పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి బదులుగా భోజన సరుకులు ఇంటి వద్దకు అందించాలని కోరారు. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసి, పేద విద్యార్థుల ఆకలి తీర్చాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను బాలల హక్కుల సంఘం కోరింది.

Tags: Children’s Rights Association, petition, HRC, supply goods, children,

Advertisement

Next Story

Most Viewed