- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంటికే పోషకాహారం
దిశ, హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా అంగన్ వాడీ కేంద్రాలు తెరుచుకోవడం లేదు. 50 రోజులకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలు బంద్ అయ్యాయి. దీంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇండ్లకే పరిమితమయ్యారు. వీరికి రోజూ అందించే సప్లమెంటరీ పోషకాలను నేరుగా లబ్ధిదారులకే చేరేలా ఐసీడీఎస్ అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ద్వారా 5 ప్రాజెక్టులను అధికారులు నిర్వహిస్తున్నారు. వీటిలో 914 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. చార్మినార్ ప్రాజెక్టులో 257, గోల్కొండ ప్రాజెక్టులో 154, ఖైరతాబాద్ ప్రాజెక్టులో 141, నాంపల్లి ప్రాజెక్టులో 191, సికింద్రాబాద్ ప్రాజెక్టులో 171 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 914 కేంద్రాలలో 6002 గర్భిణులు, 5089 మంది బాలింతలు, 7 నెలల నుంచి 3 ఏండ్ల చిన్నారులు 54,625 మంది, 3 నుంచి 6 ఏండ్ల ప్రీ స్కూల్ విద్యార్థులు 13,715 మంది నమోదయ్యారు. వీరందరికి అంగన్ వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తుంటారు. 7 నెలల నుంచి 3 ఏండ్ల లోపు చిన్నారులకు రోజుకు 100 గ్రాముల బాలామృతం, నెలకు 16 గుడ్లు, గర్భిణులు, బాలింతలకు నెలకు 30 గుడ్లు, రోజుకి 150 గ్రాముల రైస్, 30 గ్రాముల పప్పుు, 15 గ్రాముల నూనె.. 3 నుంచి 6 ఏండ్ల లోపు ప్రీ స్కూల్ విద్యార్థులకు నెలకు 30 రోజులు గుడ్లు, 75 గ్రాముల రైస్, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనె చొప్పున ఐసీడీఎస్ అందిస్తోన్నది. దీని ప్రకారమే పిల్లలకు పోషకాహారాన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో అందిస్తారు. కానీ, ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నందున అంగన్‌వాడీ కేంద్రాలను బంద్ చేశారు.
ఇంటికే సరఫరా…
కరోనా వైరస్ తో చిన్నారులకు మరింత ప్రమాదకరం ఉన్నందున లాక్‌డౌన్ లో భాగంగానే అంగన్ వాడీ కేంద్రాలన్నింటికీ తాళాలు వేయాల్సి వచ్చింది. చిన్నారులతో పాటు, బాలింతలకు, గర్భిణులకు పోషకాహరం అందించడం తప్పనిసరి. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన వారి ఇంటికే అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రాజెక్టుల వారీగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పోషకాహారాన్ని సరఫరా చేస్తోన్నది. ఏప్రిల్ నెలలో జిల్లా వ్యాప్తంగా 6002 గర్భిణులకు గానూ 5510 మందికి, 5089 మంది బాలింతలకు గానూ 4725 మందికి, 7 నెలల నుంచి 3 ఏండ్లు కలిగిన 54,625 మందికి గానూ 53,649 మందికి, 3 నుంచి 6 ఏండ్ల వయస్సు ఉన్న 13,715 ప్రీ స్కూల్ విద్యార్థులకు గానూ 13,078 మందికి పోషకాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు నేరుగా కేంద్రాల వద్ద భౌతిక దూరం నిబంధనలు అమలు చేస్తూ తమ పోషకాహారాన్ని అందుకుంటున్నారు. నగరంలో కంటైన్మెంట్ ప్రాంతాలుగా ఉండే ఏరియాలో మాత్రం స్వయంగా సిబ్బందే లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ఆహారం అందిస్తున్నారు.