ఆఫర్లకు ‘సూపర్’ కత్తెర!

by Shyam |   ( Updated:2020-04-23 00:30:15.0  )
ఆఫర్లకు ‘సూపర్’ కత్తెర!
X

దిశ, న్యూస్‌బ్యూరో : లాభార్జనలో వినూత్నంగా ఆలోచించే కార్పొరేట్ సూపర్ మార్కెట్‌లు లాక్‌డౌన్ కాలాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. మామూలు రోజుల్లో రకరకాల ఆఫర్ల పేరుతో వినియోగదారులను ఆకర్షించే ఈ మార్కెట్లు.. ప్రస్తుతం లాక్‌డౌన్ కాలంలో ఎలాంటి ఆఫర్లు లేకున్నా నిత్యావసర వస్తువుల విక్రయాలపై భారీ లాభాలనే మూటగట్టుకుంటున్నాయి. సంప్రదాయ కిరాణా దుకాణాల వ్యాపారం ఎలా ఉన్నా సూపర్ మార్కెట్ల వ్యాపారం మాత్రం జోరుగానే సాగుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి సరుకు రవాణాపై ఆంక్షలు ఉండటంతో కొంత మేరకు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వ్యాపారం చేయలేకపోతున్నాయిగానీ.. అది కూడా మెరుగుపడితే వారి వ్యాపారం మరింతగా పెరిగేది. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రకాల వ్యాపారాలు కుప్పకూలిపోయినా సూపర్ మార్కెట్లు మాత్రం భేషుగ్గా లాభాల బాటనే పయనిస్తున్నాయి. మామూలు సమయాల్లో ‘ఒకటి కొంటే మరొకటి ఫ్రీ’, ‘మూడు కొంటే ఒకటి ఉచితం’, ‘ఎంఆర్‌పీపై 50% తగ్గింపు..’ ఇలా అనేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రిలయన్స్, బిగ్ బజార్, డీ-మార్ట్, స్పెన్సర్స్, హెరిటేజ్, మోర్, రత్నదీప్ లాంటి అనేక రిటైల్ సంస్థలు రకరకాల ఆఫర్లు ఇచ్చేవి. కానీ, లాక్‌డౌన్ ప్రారంభం కావడంతో అవన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి.

‘ఉచితం’, భారీ తగ్గింపు’ లకు మంగళం..

గతంలో ఉన్న ఆఫర్లను పూర్తిగా ఎత్తేశాయి. ప్రత్యేక సేల్స్, డిస్కౌంట్లను ఆపేశాయి. అప్పటిదాకా ఆఫర్‌లో ఉన్న వస్తువులనే ఇప్పుడు ఎంఆర్‌పీ ధరకు విక్రయిస్తూ.. ‘ఉచితం’, భారీ తగ్గింపు’ లాంటి ఆఫర్లకు మంగళం పాడాయి.

ఓ ప్రముఖ రిటైల్ మార్కెట్‌లో నిన్నటివరకూ రూ.1,050 ధరకు విక్రయించిన సోనామసూరి ప్రీమియం రైస్ (25 కేజీలు) లాక్‌డౌన్ కాలంలో రూ.1,150 ధరకు అమ్ముతోంది. స్టాక్ తగ్గిపోతున్నకొద్దీ డిమాండ్ పెరుగుతోంది. లాక్‌డౌన్‌లో కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం పడటంలేదని ఆ దుకాణం ఫ్లోర్ మేనేజర్ ఒకరు వ్యాఖ్యానించడం.. ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తోంది.

ఎండాకాలం ప్రారంభమవుతుండటంతో కూల్ డ్రింక్స్‌పై సూపర్ మార్కెట్లలో ‘బై వన్ .. గెట్ వన్ ఫ్రీ’ లేదా ‘వన్ ప్లస్ ఒన్, టూ ప్లస్ వన్’ లాంటి బంపర్ ఆఫర్లను ప్రకటించడం ఆనవాయితీ. కొన్ని రిటైల్ మార్కెట్లు వారాంతపు సంతల పద్ధతిలో కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించేవి. మరికొన్ని రాత్రి 8 గంటల తర్వాత ఆఫర్లు ఇచ్చేవి. కూరగాయలు, పండ్లు లాంటివి మరుసటి రోజుకు ప్రెష్‌గా ఉండవు కాబట్టి రాత్రి 8.00 గంటల నుంచి మూసివేసే వరకు యాభై శాతం తగ్గింపు ధరకే అమ్మేవి. ఇప్పుడు అలాంటి ఆఫర్లేవీ లేవు. గతంలో భారీ స్థాయిలో పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం, బ్రోచర్ల పంపిణీ తదితర రకరకాల మార్గాల్లో వినియోగదారులను ఆకర్షించేవి. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. తగ్గింపు ధరలను ఎత్తేసి ఎంఆర్‌పీ ధరలకు అమ్మినా వ్యాపారం జోరుగానే సాగుతోంది.

Tags: Lackdown, offers, sale, customers, super market, discount

Advertisement

Next Story

Most Viewed