పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల కొరత.. ఇబ్బంది పడుతోన్న విద్యార్థులు

by  |   ( Updated:2021-11-30 03:28:06.0  )
పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల కొరత.. ఇబ్బంది పడుతోన్న విద్యార్థులు
X

దిశ, తిరుమలగిరి (సాగర్) : కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో మూతపడిన పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు విద్యాశాఖ సెప్టెంబర్ ఒకటో తేదీన పున:ప్రారంభించినప్పటికీ విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలగిరి (సాగర్) మండల పరిధిలో ఉన్న నాలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల వారిగా బోధించే ఉపాధ్యాయులు సరిపడ లేకపోవడంతో పదో తరగతి విద్యార్థుల చదువు అయోమయంలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుమలగిరి(సాగర్) మండలంలోని తిరుమలగిరి, రాజవరం, నెల్లికల్లు, నేతాపురం గ్రామాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నప్పటికీ సబ్జెక్టుల వారీగా బోధించే ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

తిరుమలగిరి ఉన్నత పాఠశాలలో తెలుగు, సోషల్, రాజవరం పాఠశాలలో తెలుగు, బయో సైన్స్, సోషల్, నెల్లికల్లు పాఠశాలలో సోషల్, నేతాపురం పాఠశాలలో సోషల్, హిందీ సబ్జెక్టుల వారీగా బోధించే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పాఠశాలలోని విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులకు ఇప్పటికే సగం సిలబస్ పూర్తయినప్పటికీ, మరికొన్ని సబ్జెక్టులు ఇప్పటికీ మొదలు కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలయింది. కొన్ని పాఠశాలల్లో ఒక సబ్జెక్టు ఉపాధ్యాయులు వేరొక సబ్జెక్టు బోధిస్తూ ఉన్నప్పటికీ విద్యార్థులకు సరైన న్యాయం చేయలేక పోతున్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటుతో ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వం విద్యా వాలంటీర్లను ఇప్పటి వరకు రెన్యువల్ చేయకపోవడంతో మండలంలో ఉన్నత పాఠశాలలతో పాటు ప్రాథమిక పాఠశాలలో కూడా ఇటువంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సర్కారు పాఠశాలలో విద్య సక్రమంగా విద్యార్థులకు అందించాలంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోక తప్పదు. మండల వ్యాప్తంగా 2020-2021 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో 1953 విద్యార్థులు ఉండగా 2021- 2022 విద్యా సంవత్సరానికి 2531 వరకు విద్యార్థుల సంఖ్య పెరిగింది. అదే విధంగా 2020-21 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలలో 2025 మంది విద్యార్థులు ఉండగా 2021-2022 సంవత్సరానికి 1593 వరకు విద్యార్థుల సంఖ్య తగ్గింది. కరోనా కారణంగా ప్రైవేట్ పాఠశాలలు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 612 మంది విద్యార్థులు పెరగడం గమనార్హం.

సాంఘిక శాస్త్రం సబ్జెక్టును బోధించుటకు టీచర్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. స్కూలు తెరిచిన్నప్పటి నుంచి ఇప్పటి వరుకు మిగతా సబ్జెక్టుల పాఠాలు చెబుతున్నారు. సాంఘిక శాస్త్రం మాత్రం బోధించడానికి ఏ ఒక్క టీచర్ రాలేదు. పరీక్షలో ఒక్క సబ్జెక్టు తప్పిన పదో తరగతి ఫెయిల్ అయినట్టే కదా. మా పాఠశాలలో ప్రతి సంవత్సరం ఒకరికీ లేదా ఇద్దరికీ 10/10 వచ్చేవి. ప్రతి ఏడు ట్రిపుల్ ఐటీ బాసరలో మా పాఠశాల విద్యార్థి ఒక్కరైనా సీటు సంపాదించేవారు. ఏ ఒక్క సబ్జెక్టులో మార్కులు సాధించకపోయినా సీటు రాదేమోనని భయంగా ఉంది.
విద్యార్థి : వంశీ, పదో తరగతి విద్యార్థి – (తిరుమలగిరి)

పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టుపై అవగాహన కలిగిన ఉపాధ్యాయులు బోధిస్తేనే వారికి పూర్తి విషయం అర్థం అవుతోంది. ఇంతకు ముందు పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్స్ లేనప్పటికీ ప్రభుత్వం విద్యా వాలంటీర్స్ ని నియమించడంతో ఇటువంటి సమస్యలు తలెత్తలేదు. కానీ ప్రస్తుతం వారికి ఈ విద్యా సంవత్సరం రెన్యువల్ ఇవ్వకపోవడంతో ఇలాంటి సమస్యలు తయారయ్యాయి. పదో తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు బోధించే విధంగా చర్యలు తీసుకోవడానికి ఎంఈఓతో చర్చిస్తా.

విద్యా కమిటీ చైర్మన్ – ఇరిగి నాగయ్య

పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వం అందించలేక పోతుంది. ఇప్పటికే పలుమార్లు విద్యాశాఖ అధికారులకు మమ్మల్ని రెన్యువల్ చేయాలని వినతి పత్రాలు సమర్పించిన ఉలుకు పలుకు లేదు. కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్, ఔట్ సోర్సింగ్ వంటి వారిని అందరినీ విధుల్లోకి తీసుకుని మమ్మల్ని మాత్రమే విధుల్లోకి తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు పాఠశాలలకు పిలుస్తారో అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాం. తక్షణమే మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మాకు భరోసా కల్పించాలి.

విద్యావాలంటీర్ :ఆంగోత్ బాబురావ్ (రంగుండ్ల)

Advertisement

Next Story

Most Viewed