బస్సు లేదాయె.. బడికి పోయేదెట్ల..!

by Anukaran |   ( Updated:2021-08-27 21:36:59.0  )
బస్సు లేదాయె.. బడికి పోయేదెట్ల..!
X

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలను ప్రారంభించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆన్లైన్ తరగతులతో నెట్టుకొస్తున్న ప్రాథమిక విద్యా వ్యవస్థ తిరిగి ప్రారంభం కానుంది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉదయం బడులకెళ్లేందుకు సాయంత్రం తిరిగి ఇంటికొచ్చేందుకు పిల్లలు ప్రజారవాణా కోసం కుస్తీ పట్టాల్సిందే. బస్సులు లేక, టైంకి రాక ఇబ్బందులు పడాల్సిందేనా అంటూ విద్యార్థుల్లో ఇప్పటి నుంచే ఆందోళన మొదలైంది. టీఎస్ ఆర్టీసీ ఇప్పటికే మారుమూల గ్రామాలకు పల్లెవెలుగు బస్సులను నిలిపివేసిన విషయం విధితమే. పాఠశాలలు ప్రారంభించనుండటంతో మూతబడిన బడుల క్లీనింగ్, శానిటైజేషన్ పైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. రోజూ వారి జిల్లా, మండల స్థాయి సమీక్షలు ఏర్పాటుచేస్తూ పిల్లల సంరక్షణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం పూర్తిగా వీటిపైనే సమాలోచనలు చేస్తూ పిల్లలు బడులకు రావడానికి అవసరమైన ప్రజారవాణా వ్యవస్థపై ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం.

స్కూళ్లు, కాలేజీలు ఒకేసారి తెరవనుండనంతో హైదరాబాద్‌లో చదువుతున్న జిల్లాల్లోని విద్యార్థుల రాక ఇప్పటికే మొదలైంది. గత కొన్ని నెలలుగా అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు నడిపే బస్సులు దాదాపు సగానికి తగ్గించారు. దీంతో రోజూ ప్రయాణించే వారికే సరిపడా బస్సులు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలకు వచ్చే పిల్లలు, వారి వెంట వచ్చే తల్లిదండ్రులతో బస్సు స్టేషన్లు కిటకటిలాడుతున్నాయి. విద్యా సంవత్సరం మొదలవడంతో ఇంటర్, బీటెక్ కాలేజీలలో తమ పిల్లల్ని చేర్పించడానికి పేరెంట్స్ పట్టణం బాట పట్టారు. అయితే వీరికి తగినన్ని బస్సులను ఏర్పాటు చేయడంలో రవాణా శాఖ విఫలమవుతోంది.

నిలిపివేసిన బస్సులను పునరుద్ధరించేందుకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వచ్చే విద్యార్థుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారింది. దీనితో పాటు మారుమూల పల్లెలకు నడిపించేందుకు తీసుకొచ్చిన పల్లెవెలుగు బస్సులను నష్టాల కారణంగా నిలిపివేశారు. దీంతో గ్రామాలకు, పల్లెలకు, తండాల విద్యార్థులకు చదువు దూరం అయ్యే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోని విద్యార్థులు సైతం రోజూ బడులకు వచ్చి పోయే విధంగా ఇప్పటికే నడుస్తున్న కొన్ని చోట్ల తిరిగి బస్సు సమయాలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

బడులకు వచ్చే విద్యార్థులకు రవాణా చార్జీల భారం ఉండకుండా ప్రభుత్వం అందించే బస్సు పాసులను జారీ చేయడంపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవి ఎప్పుడు అందిస్తారనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. అంతేకాకుండా గ్రేటర్ పరిధిలో చదువుకునే విద్యార్థుల కోసం మరిన్ని సిటీ బస్సులను ఏర్పాటుచేసి బస్ పాసులు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఇంజనీరింగ్, వైద్య కాలేజీలు ఉండే వైపు మరిన్ని బస్సులు నడిపించాలన్న డిమాండ్ ముందు నుంచీ ఉంది.

Advertisement

Next Story

Most Viewed