కాషాయంలో రగులుతున్న అసంతృప్తి.. కనిపించని దుబ్బాక జోష్

by Shyam |
mlc ramchander rao
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : మొన్నటి వరకూ జోష్ మీద ఉన్న బీజేపీ నేడు ఉనికి కోసం పాట్లు పడుతున్నది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీ నేడు ఓట్ల కోసం శ్రమిస్తున్నది. రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో పార్టీ ఊపు అంతగా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. యువతే బలంగా దూసుకొచ్చిన కాషాయం ఇప్పుడు వారి మద్దతును కూడగట్టడంలో విఫలమవుతున్నది. పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో గతసారి విజయం సాధించిన ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు విస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్ఠానం నిర్ణయం సరైందని కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ బలపరిచిన దేవి శ్రీప్రసాద్‌ను కాదని బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావును గెలిపిస్తే.. సమస్యలపై సరైన రీతిలో స్పందించలేదని గ్రాడ్యుయేట్లు గుర్రుగా ఉన్నారు. నిరుద్యోగ సమస్య, ఉపాధి, ఉద్యోగ విషయంలో ఆయన ఏనాడూ శాసన మండలిలో గళం విప్పిన దాఖలాలు లేవు. ఎంత సేపటికీ ఆయన సొంత కార్యకలాపాలను చక్కదిద్దుకోవడం..కోర్టు వ్యవహారాలు చూసుకోవడంతోనే సరిపెట్టుకున్నారని పలువురు మండిపడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నా.. అభ్యర్థి ఎంపిక విషయంలోనే పార్టీ అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత పేర్కొన్నాడు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వెళ్లితే.. గతసారి గెలిచిన మీ ఎమ్మెల్సీ మా నిరుద్యోగుల కోసం ఏమి చేశారో చెప్పాలని నిలదీస్తున్నట్లు ఆయన వాపోతున్నాడు.

రెండు సార్లు ఓడినా..

ఎమ్మెల్సీగా కొనసాగుతున్న రాంచందర్ రావుకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లోనూ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయనను కీలకమైన రెండు ఎన్నికల్లో పోటీ చేయించడంపై ఆ పార్టీలోని సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు. తామంతా పార్టీని నమ్ముకొని పనిచేస్తే.. మమ్మల్ని కాదని రాంచందర్ రావుకే ప్రతిసారి పార్టీ అవకాశాలు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కినుక వహించిన సొంత పార్టీలోని కొందరు నేతలే ఆయన గెలుపు కోసం పని చేయడం లేదని మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ కీలక నేత వెల్లడించారు. ప్రతిసారి పార్టీ టిక్కెట్ ఆయనకే ఇస్తే మా పరిస్థితి ఏమిటని పలువురు నేతలు అధిష్ఠానంపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఓట్లు రాల్చే వ్యూహమేదీ?

బీజేపీ ఓట్లు రాల్చే బలమైన నినాదం కానీ.. విధానం కానీ తీసుకురాకపోవడంతో క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్‌ కనిపించట్లేదు. ఓవైపు కేటీఆర్, హరీశ్ రావు ఇంకోవైపు మంత్రులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవిని వెంటేసుకొని జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తుంటే బీజేపీ పార్టీ నేతలు మాత్రం తాము కూడా బరిలో ఉన్నామనే సంకేతాలిచ్చే దశలోనే ఇంకా నిలిచిపోవడం చర్చనీయాంశమవుతోంది. పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజల్లో ఆ పార్టీపై విశ్వా సం కల్పించే ప్రయత్నాలకు, ప్రచారాలకు పూనుకోలేదు. పార్టీ కేడర్‌లోనూ, ప్రజల్లోనూ భరోసా కల్పించడంలో బీజేపీ విఫలం కావడంతో ఓటింగ్‌ శాతం తగ్గే అవకాశముందనే సంకేతాలతో సీఎం కేసీఆర్‌ సైతం పోలింగ్‌ శాతం తగ్గకుండా చూడాలని, అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో పోలింగ్‌ జరిగేలా చూడాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడటం గమనార్హం.

ఊపు కోసమేనా..?

కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో తామే చక్రం తిప్పుతామంటూ కమలనాథులు ప్రకటనలు చేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో తమకు ఎంతో కొంత బలముందని భావించే హైదరాబాద్‌ జంట నగరాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డారు. ఉన్న సీట్లను కూడా పోగొట్టుకొని లోక్‌సభ ఎన్నికల ముందు బోర్లాపడిన బీజేపీలో ఇప్పటికీ అనుకున్నంత జోష్‌ రావట్లేదు. దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన ఆ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేంద్ర మంత్రులను రంగంలోకి దింపిన అనుకున్న స్థానాలను గెలుచుకోలేకపోయింది. ప్రధాని మోడీతో సహా బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇలా ఎంత పెద్ద నేతల పేర్లు చెప్పినా కేడర్‌లో కిక్‌ రావట్లేదు. రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పార్టీలో ఊపు తెచ్చినా..ఎందుకనో ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడంలేదు. మొత్తంమీద బీజేపీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తోందా..? లేక చతికిలబడుతుందా..? వేచిచూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed