- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్పీకర్ పోచారం ఇలాకాలో వరుస ఫుడ్ పాయిజన్స్.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న విద్యార్థులు
దిశప్రతినిధి, నిజామాబాద్ : కరోనా ముగిసిందని పాఠశాలలు తెరిస్తే విద్యార్థులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. వైరస్ బారిన పడటం అటుంచి విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తే చాలు వాంతులు, విరేచనాలకు గురవుతున్నారు. సర్కారు స్కూళ్లలో డ్రాప్ ఔట్‌లను తగ్గించేందుకు పేద విద్యార్థులకు విద్యనందించేందుకు ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకం పిల్లల పాలిట శాపంగా మారింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలో ఈ నెల 20 నుంచి వారం రోజుల్లో మూడు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఈ నెల 20న రుద్రూర్ మండలం రాయకూర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు సైలెన్లు ఎక్కించి సకాలంలో వైద్య సేవలందించి కాపాడగలిగారు. ఘటన జరిగిన మరుసటి రోజు బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురయ్యారు. వారిలో పది మందిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. బుధవారం బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. వారం రోజుల్లో నియోజకవర్గంలోని మూడు మండలాల్లో గల జిల్లా పరిషత్ హైస్కూల్, మండల పరిషత్ హైస్కూల్, ప్రైమరీ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించడం ఆందోళన కలిగించింది.
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడం సర్వసాధారణమైంది. ఎందుకంటే కరోనా కాలానికి ముందు తీసుకువచ్చిన బియ్యం, పప్పులు ఇతర సామగ్రి కుళ్లిపోయాయి. వాటిని విద్యాధికారులు వెనక్కి తీసుకుని కొత్త సరుకులను ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ చాలా పాఠశాలల్లో ముక్కిపోయిన సామగ్రి వెనక్కి తీసుకువెళ్లలేదని సమాచారం. దానికి తోడు మధ్యాహ్న భోజన ఏజెన్సీల బకాయిలు ఉండటంతో వారు వాటిని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. బకాయిలు చెల్లించలేకపోవడంతో అప్పో సప్పో చేసి తెస్తున్న సామగ్రి నాసీరకంగా ఉంటుంది.
మధ్యాహ్న భోజనం ప్రభుత్వ ఉపాధ్యాయులు పరిశీలించి పిల్లలకు పెట్టాల్సి ఉండగా దానిని పట్టించుకోకపోవడంతో నాసీరకంగా ఉన్న వస్తువులు, కుళ్లిపోయిన వంట సామాగ్రితో వండిన ఆహార పదార్థాలు తిన్న విద్యార్థులు అస్వస్థత బారిన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రులలో విద్యార్థులను చూసి స్పందిస్తున్నా విద్యాశాఖాధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. వారం రోజుల్లో మూడు సార్లు పిల్లలకు వైద్య సేవలను అందించడాన్ని స్వయంగా పరిశీలించి సూచనలు చేసినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల విద్యాశాఖాధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వారం రోజుల్లో 3 ఘటనలు జరిగినా ఒక్క ఉపాధ్యాయుడు కూడా మధ్యాహ్న భోజన ఏజెన్సీలను సంజాయిషి కోరకపోవడంతోనే ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయనే ఆరోపణలున్నాయి.