నిద్రమత్తు ప్రమాదాలకు చెక్ పెట్టిన బీటెక్ స్టూడెంట్.. ఆ పరికరంతో

by Shyam |   ( Updated:2021-10-14 02:34:39.0  )
నిద్రమత్తు ప్రమాదాలకు చెక్ పెట్టిన బీటెక్ స్టూడెంట్.. ఆ పరికరంతో
X

దిశ, ఫీచర్స్: ‘యాక్సిడెంట్ అంటే కారు లేదా బైక్ రోడ్డు మీద పడటం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం’ అని ఓ రచయిత అన్నట్లు.. యాక్సిడెంట్స్ వల్ల నిత్యం వేలాదిమంది అనాథలవుతున్నారు. అయితే ఎన్నో రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యం కంటే నిద్రమత్తే ఎక్కువ కారణమవుతుండటం కలవరపెట్టే అంశం. ఈ క్రమంలోనే 2017లో డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరగ్గా, యావత్ దేశం కన్నీరుపెట్టింది. ఒకటి టూరిస్ట్ బస్ కాగా, మరొకటి స్కూల్ పిల్లల బస్సు. ఈ న్యూస్‌ వైజాగ్ కు చెందిన బీటెక్ స్టూడెంట్ ప్రదీప్ వర్మ (22)ను కలచివేయగా.. ప్రమాదాల నివారణకు సాంకేతికత ఎందుకు లేదనే ఆలోచనలో పడేసింది. అదే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే స్ఫూర్తినిచ్చింది.

నిద్రమత్తులో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల అంశాన్ని సీరియస్‌ ఇష్యూగా తీసుకున్న ప్రదీప్ వర్మ.. వీటిపై కొంత పరిశోధన చేశాడు. ఈ మేరకు యాక్సిడెంట్స్‌ను ముందస్తుగా గుర్తించడంతో పాటు వాటిని అంచనా వేసే సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికి, డ్రైవర్ నిద్రపోతున్నాడని గుర్తించగల సాధనాలు అంత ప్రబలంగా లేవని గ్రహించాడు. తన స్నేహితులు జ్ఞాన్ సాయి, రోహిత్‌లతో కలిసి ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపే సాంకేతికతపై పనిచేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో రెండింటిని( డ్రైవర్, రోడ్డు) పర్యవేక్షించే వ్యవస్థ కావాలని డిసైడ్ అయిన టీమ్.. అందుకోసం ఇండస్ట్రీయల్- గ్రేడ్ కెమెరాలను ఉపయోగించారు. AI- పవర్‌తో పనిచేసే ఈ కెమెరాలు డ్రైవర్ బ్లింక్ రేటును పర్యవేక్షించేలా ప్రోగ్రామ్ చేశారు.

‘బ్లింక్ రేటు నెమ్మదిగా మారితే డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్తున్నాడని అర్థం. దీంతో డివైజ్ వెంటనే అలర్ట్ అయిపోయి అతడిని నిద్రలేపడానికి పెద్ద సౌండ్ సిస్టమ్ మోగిస్తుంది. అయితే కొన్ని సమయాల్లో డ్రైవర్ తనకు తెలియకుండానే కొన్ని సెకన్ల పాటు నిద్రపోతుంటాడు. దీన్నే మైక్రో-స్లీప్‌ అంటాం. దీన్ని ట్రాక్ చేయడానికి కెమెరా కూడా ప్రోగ్రామ్ చేశాం. ఈ సిస్టమ్ పూర్తిగా ఇంటర్నెట్ ఆధారితమైనది. లొకేషన్ ట్రాక్ చేయడానికి జీపీఎస్‌ కలిగి ఉంటుంది. సేకరించిన డేటా క్లౌడ్‌కు అప్‌లోడ్ అవుతుంది. ఆ సమాచారాన్ని మేము అభివృద్ధి చేసిన యాప్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. కెమెరా ఫుటేజీని అందించడమే కాకుండా డ్రైవర్ పనితీరు, దానిని ఎలా మెరుగుపరచవచ్చు, వారి రహదారి భద్రత గురించి వివరాలను కూడా యాప్ అందిస్తుంది. 2018‌లో ఈ పరికరం దక్షిణ మండలంలోని అంతర్జాతీయ ఇన్నోవేషన్ ఫెయిర్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాకు ప్రశంసలు అందించాడు’ అని ప్రదీప్ వర్మ తెలిపాడు.

2019లో ప్రదీప్ వర్మ బృందం ‘క్షేమిన్ ల్యాబ్స్’ అనే స్టార్టప్‌ను ప్రారంభించి, ఆ పరికరాన్ని అభివృద్ధి చేసే పని ప్రారంభించింది. వారు తయారుచేసిన ఓ డివైజ్‌ను ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఆపరేటర్‌పై పరీక్షించి, పరికరంలో మార్పులు చేయాల్సి వచ్చింది. అయితే మహమ్మారి కారణంగా ఆ పని ఆగిపోగా, ప్రస్తుతం తమ పరికరాన్ని సవరించిన బృందం.. ఇప్పుడు తమ పరికరానికి మరిన్ని టెస్టింగ్స్ కోసం అంతర్జాతీయ పాఠశాలలు, రాష్ట్ర రవాణాశాఖతో చర్చలు జరుపుతున్నారు. కాగా డ్రైవర్ల నిద్రను గుర్తించి వెంటనే అప్రమత్తం చేసే ఈ పరికరం.. రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాలు నిరోధించడంలో ఉత్తమ ఫలితాలు అందిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed