- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ఇంకెప్పుడు..? నెలన్నర దాటినా ప్రకటించని అధికారులు..
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్‌పై స్పష్టత లేకుండా పోయింది. ఫలితాలు ప్రకటించి నెలన్నర దాటినా నేటికీ కౌన్సెలింగ్షెడ్యూల్ప్రకటించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడ్‌సెట్ ఫలితాలు సెప్టెంబర్ 24వ తేదీన ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. అదే సమయంలో మరో పది రోజుల్లో కౌన్సెలింగ్ తేదీని ఖరారు చేస్తామని ప్రకటించింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ షెడ్యూల్‌ను ప్రకటించకపోవడంతో ఎడ్‌సెట్‌లో ఉత్తీర్ణత సాధించిన 33,683 మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో 34,185 మంది పరీక్షకు హాజరయ్యారు. కాగా 33,683 మంది విద్యార్థులు అర్హత సాధించగా ఇందులో 25,983 మంది అమ్మాయిలు, 7700 మంది అబ్బాయిలున్నారు. కౌన్సెలింగ్ప్రక్రియ ఆలస్యం అవుతున్నా కొద్దీ విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు.
ఇంకా పూర్తికాని అఫిలియేషన్ ప్రక్రియ
రాష్ట్ర వ్యాప్తంగా 206 బీఈడీ కాలేజీలున్నాయి. వీటిలో ప్రవేశాలకు ఆగస్టులో పరీక్ష నిర్వహించారు. కాగా పరీక్ష షెడ్యూల్ ప్రకటించాక కాలేజీల్లో ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు. అన్ని వసతులు ఉన్నాయా లేదా అని ముందస్తుగానే అఫిలియేషన్ ప్రక్రియ(ఇన్ స్పెక్షన్)ను అధికారులు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే కాలేజీల్లో సరిపడా స్టాఫ్లేకున్నా.. వసతులు లేకున్నా కాలేజీల అనుమతులు రద్దు చేయాల్సి ఉంటుంది. అనంతరం మిగిలిన కాలేజీల లిస్ట్ ప్రిపేర్ చేసి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ఈసారి అధికారులు అఫిలియేషన్ ప్రక్రియను పూర్తి చేపట్టక పోవడంతో కౌన్సెలింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఆలస్యమైందని గగ్గోలు పెడుతున్న విద్యార్థులు..
సాధారణంగా విద్యాసంవత్సరం అంటే జూన్టు జూన్‌ను లెక్కిస్తారు. కానీ బీఈడీ, డైట్‌సెట్, ఎడ్‌సెట్ పరీక్షలను ఇష్టారాజ్యంగా నిర్వహించడం వల్ల ఆగస్టు, సెప్టెంబర్వరకు అభ్యర్థుల సమయం వృథా అవుతోంది. తద్వారా కౌన్సెలింగ్ పూర్తయి ప్రవేశాలు జరిగేసరికే జనవరి కావొస్తోంది. అయితే ఈసారి డైట్ సెట్‌ను సమయానికే పూర్తిచేసినా ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌ను మాత్రం ఆలస్యం చేస్తున్నారు. డిగ్రీ ఫైనల్ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఎడ్‌సెట్‌కు అర్హులే కావడంతో వారే ఎక్కువ శాతం ఉంటున్నారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ మాత్రం నేటికీ వెలువడక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వారు బీఈడీ చేద్దామన్నా.. ఇతర కోర్సుల్లో చేరుదామన్నా.. కౌన్సెలింగ్ ప్రారంభించక పోవడంతో సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉండగా కౌన్సెలింగ్‌కు మరో మూడు వారాలకు పైగా సమయం పట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కౌన్సెలింగ్ తేదీలు వెంటనే ప్రకటించాలి.
ఎడ్ సెట్ 2021 పరీక్ష రాసిన అభ్యర్థులు బీఈడీలో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంత ఆలస్యం చేస్తే విద్యార్థుల భవిష్యత్‌కు ఇబ్బందిగా మారుతుంది. అధికారులు ప్రైవేట్ కాలేజీల తనిఖీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఒకసారి కొన్ని యూనివర్సిటీల డిగ్రీ ఫలితాలు ఇవ్వలేదని, మరోసారి బీఈడీ కాలేజీల అనుమతుల పేరుతో సాగదీయడం వల్ల ఎడ్ సెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎడ్ సెట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేయాలని రావుల రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరాడు.