అవి ప్రభుత్వ హత్యలే.. విద్యార్థి సంఘాలు ఆగ్రహం

by Sridhar Babu |
SFI, AISF
X

దిశ, ఖమ్మం టౌన్: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్‌ను ముట్టడించి, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అశోక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు ఆజాద్ మాట్లాడుతూ.. గురుకుల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం మూలంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గురుకుల విద్యార్థులకు సెల్‌ఫోన్‌లు లేక మనోవేధనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామవరం గ్రామంలో మామిళ్ల రవి(17) అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాధాకరమని, ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని అన్నారు.

గురుకుల విద్యార్థులను శవాలుగా మారుస్తున్న ఘటన టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 8 మంది, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నలుగురు విద్యార్థులు చనిపోయారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాల్లో సైతం అనేకమంది గురుకుల విద్యార్థులు చనిపోతున్నారని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చనిపోయిన ప్రతీ విద్యార్థి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ జాజ్ కల్పించాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలు ప్రారంభం అయ్యేలా వెంటనే కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు నవీన్, వెంకటేష్, పండగ పురుషోత్తం తదితర విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed