ఎంసెట్ క్వాలిఫై కాలేదని విద్యార్థిని ఆత్మహత్య

by Anukaran |
ఎంసెట్ క్వాలిఫై కాలేదని విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, నల్లగొండ: “అమ్మా.. నాన్న నన్ను క్షమించండి. మీకు నా మొఖం చూపించలేను. మీరు నామీద పెట్టుకున్న ఆశలు అడి ఆశలయ్యాయి. నేను మాట నిలబెట్టుకోలేకపోయాను. మిమ్మల్ని వదిలివెళుతున్నా నన్ను క్షమించండి” అంటూ ఆ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్థుల్లాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. గ్రామానికి చెందిన కోయ రవీందర్ రెడ్డి, అరుణ దంపతుల ఏకైక కూమార్తె స్నేహా రెడ్డి(17) ఇటీవల ఎంసెట్ పరీక్ష రాయగా బుధవారం ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల్లో స్నేహాకు మంచి మార్కులు రాకపో వడంతో పాటు క్వాలీఫై కాలేకపోయింది. దీంతో మనస్తాపం చెందిన స్నేహా మధ్యాహ్నం 2గంటల సమయంలో ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసు కుంది. తల్లి అరుణ ఏఎన్‌ఎం కావడంతో విధులపై కురంపల్లికి వెళ్లింది. అమ్మను తీసుకురమ్మని తమ్ముడు సిద్ధును కురంపల్లికి పంపి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకుంది.

అదే సమయంలో తండ్రి బావి వద్ద వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చినప్పటికీ ఇదేమి తెలియక అతను బయటే కాళ్లు చేతులు కడుక్కొని ఇంటి ఆవరణలోనే కూర్చున్నాడు. కొద్దిసేపటికి సిద్ధు తల్లిని బైక్‌పై తీసుకురాగా, ఇంట్లోకి వెళ్లి చూసే సరికి స్నేహా కొన ఊపిరితో ఫ్యానుకు వెళాడుతూ కని పించింది. వెంటనే ఆమెను కిందకి దించినప్పటికీ ఆలస్యం కావడంతో ప్రాణాలు విడిచింది. స్నేహా తల్లి ఏఎన్‌ఎం కావడం‌తో కూతురు చనిపోయిందని తెలియక పల్స్ రేట్ చూస్తున్న తీరు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. అయితే తాను నేరుగా ఇంట్లోకి వెళ్లి ఉంటే కూతురుని కాపాడుకుని ఉండేవాడినని తండ్రి కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని కనగల్ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story