‘చదువు కొనలేక చనిపోయింది’

by Sumithra |   ( Updated:2020-11-09 05:55:45.0  )
‘చదువు కొనలేక చనిపోయింది’
X

దిశ, తెలంగాణ బ్యూరో: మారుతున్న పరిస్థితుల్లో భాగంగా ఇప్పటికే ప్రతీ ఒక్కరికీ స్మార్ట్‌ ఫోన్ నిత్యవసర సరుకుగా మారింది. ఇప్పుడు ఆ జాబితాలో లాప్‌టాప్‌ కూడా చేరిపోయింది. కరోనా ప్రభావంతో తరగతి బోధనకు బ్రేక్ పడి ఆన్‌లైన్ క్లాసుల విధానానికి తెరలేచింది. దీంతో స్మార్ట్ ఫోన్లతో నెట్టుకొస్తున్నారు. పాఠాలు వినడంతో పాటు ప్రాజెక్టులు, వర్క్ షీట్లు చేసుకునేందుకు ఫోన్ల కంటే లాప్‌టాప్‌లు సౌకర్యంగా ఉంటాయి. దీంతో ఇప్పుడు విద్యార్థులకు ఇదొక తప్పనిసరి వస్తువుల జాబితాలో చేరిపోయింది. ఆన్‌లైన్ పాఠాలు బోధన ప్రారంభమైన సమయంలో ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లు చేపట్టారు. ఇంటర్, ఆపైనా విద్యార్థులకు ఫోన్లతో నెట్టుకురావడం కష్టమవుతోంది. విద్యారంగంలో వస్తున్న మార్పులు పేదల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఈ తరహాలోనే లాక్‌డౌన్ ఆర్థిక కష్టాలతో నెట్టుకొస్తున్న కుటుంబంపై ‘లాప్‌టాప్‌‌’ అదనపు భారం వేయలేక ఓ విద్యార్థిని తనువు చాలించింది.

అసలేమైందంటే?

ప్రాజెక్టు వర్క్ చేసేందుకు లాప్‌టాప్ లేకపోవడంతో తాను చదువులో వెనకబడుతానేమోననే భయంతో రంగారెడ్డి జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య (19) లేడీ శ్రీరామ్ కాలేజీ ఫర్ ఉమెన్(LSR) కళాశాలలో బీఎస్సీ సెకండియర్ (Honors) చదువుతోంది. లాక్‌డౌన్ విధింపుతో ఆమె ఇంటికి చేరుకుంది. ఆన్‌లైన్ క్లాసుల్లో తాను వెనకబడుతున్నాన్న ఆందోళనతో, పరిస్థితులను మెరుగు పరుచుకునేందుకు అవకాశం లేదని భావించి ఈ నెల 2న ఆత్మహత్య చేసుకుంది. లాక్‌డౌన్ విధింపుతో వచ్చిన కుటుంబ ఆర్థిక కష్టాలకు అదనంగా తాను భారం కాకుడదని చనిపోతున్నట్టు సూసైడ్ నోట్ రాసింది.

మధ్యలోనే కూలిపోయిన ఐఏఎస్ కల:

మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఐశ్వర్యకు ఐఏఎస్ చదవాలన్నది కల. చిన్నప్పటి నుంచి చదువులోనూ మెరుగ్గా ఉండేది. పదో తరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచింది. ఇంటర్మీడియట్‌లోనూ పట్టణ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించింది. ఎల్‌ఎస్ఆర్ కాలేజీలోనూ మెరిట్ ర్యాంకుపైనే సీటు దక్కించుకుంది. ఇన్‌స్పైర్ రీసెర్చ్ స్కాలర్ షిప్ అవార్డు కోసం ప్రొవిజిలన్ లెటర్‌ను కూడా అందుకుంది. ఆమె కలను నిజం చేసేందుకు అప్పులు చేసి చదవిస్తున్నామని ఐశ్వర్య తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, సుమతి తెలిపారు. చదువులోనే యాక్టివ్‌గా ఉన్న ఐశ్వర్యకు ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు లాప్‌టాప్ లేదనే మనోవేదన ఎక్కువయింది. లాప్‌టాప్ లేకపోవడం వల్ల చదువులో వెనకబడి, కుటుంబానికి మరింత భారంగా మారుతనని భావించి ఆత్మహత్మకు పాల్పడినట్టు తెలుస్తోంది.

కుటుంబమంతా ఐశ్వర్యపైనే ఆశలు పెట్టుకుంది. కుటుంబ అవసరాలు, చదువుల కోసం రూ. 2లక్షల లోన్ తీసుకున్నారు. ఇంట్లో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి చదివిస్తున్నారు. ఇద్దరు అమ్మాయిల చదువులు, కుటుంబ అవసరాలు భారమతున్నాయని భావించి ఐశ్వర్య చెల్లెలు వైష్ణవి(16)ని ఏడో తరగతిలోనే చదువు ఆపివేయించారు. సుమతి టైలరింగ్ చేస్తుండగా, కుటుంబాన్ని పోషించుకునేందుకు శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో బైక్ మెకానిక్ షాపును ప్రారంభించాడు. లాక్‌డౌన్ కారణంగా దుకాణం కూడా అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. దీంతో కుటుంబం మరింత ఆర్థిక కష్టాల్లోకి వెళ్లింది. మరో వైపు ఆన్‌లైన్ క్లాసుల్లో తాను వెనకబడుతున్నానని ఐశ్వర్య భావిస్తూ వచ్చింది. లాప్‌టాప్ కొనాలని కుటుంబంపై ఒత్తిడి చేయలేని పరిస్థితుల్లో స్కాలర్ షిప్‌ కోసం సోనూసూద్‌కు ఈ మెయిల్ కూడా చేసింది.

మెయిల్ ఏమని చేసిందంటే?

‘లాప్‌టాప్ కచ్చితమైన అవసరంగా మారుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తుండటం, ప్రాక్టికల్ పేపర్లను చదువుకునేందుకు ఇది తప్పనిసరైంది. నాకు లాప్‌టాప్ లేదు. దీంతో ప్రాక్టికల్ పేపర్లు చేయలేకపోతున్నాను. ఈ పేపర్లలో ఫెయిల్ అవుతానేమోనని భయం వేస్తోంది. మా కుటుంబం ఇప్పటికే పూర్తిగా అప్పుల్లో ఉంది. మా కుటుంబానికి లాప్‌టాప్ కొనేందుకు ఎలాంటి మార్గం కనిపించడం లేదు. ఆర్థిక సమస్యతో నా డిగ్రీ కూడా పూర్తి చేస్తానో లేదో తెలియడం లేదు. ’ అంటూ సెప్టెంబర్ 14న ఐశ్వర్య సోనూసూద్‌కు మెయిల్ చేసింది. ఎక్కడి నుంచి తనకు సహాయం అందకపోవడంతో దిక్కుతోచని స్థితిలో.. మానసిక ఒత్తిడితో కుటుంబానికి భారం కావొద్దని ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం.

లాక్‌డౌన్ కుటుంబ ఆర్థిక స్థితులను కిందకు దిగజార్చాయి. ఇదే సమయంలో విద్యారంగంలోనూ కొత్త అవసరాలను సృష్టించాయి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయలేక కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఐశ్వర్య సోదరి చదువు ఇప్పటికే ఆగిపోయింది. ఆశలు పెంచుకున్న అమ్మాయి అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించుకుంది. కుటుంబం చేసిన అప్పులు అలాగే ఉన్నాయి. తాకట్టు పెట్టిన బంగారం తిరిగొస్తుందన్న నమ్మకం లేదు. ఐఏఎస్ చదువుతుందనుకున్న విద్యార్థి కుటుంబం ఇలా ఒక్క దెబ్బకు కకావికలమయింది. విద్యార్థులు మానసిక స్థైర్యం కోల్పోకుండా చూసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

Advertisement

Next Story