కరోనా ఎంటరైతే ఎలా ఉంటుంది?

by sudharani |
కరోనా ఎంటరైతే ఎలా ఉంటుంది?
X

కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్.. సార్స్, ఎబోలా కంటే భయకంపితులను చేస్తున్న వైరస్ కరోనా. ప్రపంచ దేశాలన్నీ కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కరోనా పేరిట జలుబు ఔషధాలు, మాస్కులు, శానిటైజర్ల కొనుగోళ్లు తారస్థాయికి చేరాయి. ఇంతకీ కరోనా ఎవరికి వస్తుంది?.. శరీరంలో ప్రవేశించిన తరువాత ఏం జరుగుతుంది?.. ఎవరికి ప్రాణాంతకంగా మారుతుంది? అన్న వివరాలు ఓసారి చూసుకుందాం..

కరోనా వైరస్.. గబ్బిలాల నుంచి మనుషుల్లోకి ప్రవేశించిన వైరస్. చైనీయులు గబ్బిలాలను ఆహారంగా తీసుకోవడంతో ఇది మానవుల్లోకి ప్రవేశించింది. తొలిసారి చైనాలోని వూహాన్ నగరంలో బయటపడింది. సాధారణ జలుబులానే బయటపడ్డప్పటికీ ఈ వైరస్ అత్యంత ప్రభావవంతమైనది. వేగంగా వృద్ధి చెందుతుంది. దీంతో ఇది సోకిన వ్యక్తి పరిశుభ్రంగా నియంత్రిత ప్రదేశంలో లేని పక్షంలో మళ్లీమళ్లీ సోకి ప్రాణానికి ప్రమాదం ఏర్పడే ప్రమాదముంది. ఇది సోకకుండా ఉండాలంటే ఇతరులకు కనీసం మీటర్ అంతకంటే ఎక్కువ దూరంగా ఉండాలి.

ఒకసారి ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే.. తొలి ఐదు రోజులూ ఎటువంటి లక్షణాలూ బయటకు కనిపించవు. మరికొందర్లో 14 రోజుల పాటు ఏ మార్పులూ నమోదు కావు. దీంతో కరోనా సోకలేదనే ధైర్యం వచ్చేస్తుంది. ఈ కారణంగానే ఈ వ్యాధి చైనా నుంచి 157 దేశాలకు పాకింది. అయితే ఈ కరోనా ప్రభావం ఒకసారి కనిపించడం ప్రారంభమైన తరువాత… తొలుత శరీరం వెచ్చబడుతుంది. ఇది మూడు రోజులు పాటు కొనసాగుతుంది. ఆ తరువాతే అసలు ప్రభావం బయటపడుతుంది.

ఆ తరువాత గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తాయి. 80 శాతం మంది కరోనా వైరస్ సోకిన వారిలో తొలుత ఈ లక్షణాలే బట్టబయలయ్యాయి. ఇక, నాలుగో రోజు నుంచి తొమ్మిదో రోజులోగా రోగనిరోధక శక్తిననుసరించి వైరస్‌ ప్రభావం ఊపిరితిత్తులపై పడి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. జ్వరం తీవ్రత ఊహించని విధంగా పెరుగుతుంది. ఊపిరి అందడం కష్టం కావడంతో పాటు గ్యాస్ట్రిక్‌ సమస్యలు కనిపిస్తాయి. దీంతో శరీరంలోని అన్ని అవయవాలు ఉక్కరిబిక్కిరి చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల్లో ఈ దశను ఎదుర్కొన్న వారు కేవలం 14 శాతం మంది మాత్రమే.

ఆపై పదిహేనవ రోజు వచ్చేసరికి ఊపిరితిత్తుల్లోని ఇన్‌ ఫెక్షన్‌ రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ఆ స్థితికి బాధితుడు చేరుకుంటే, తదుపరి రెండు వారాల పాటు అతనికి అందించే వైద్యం అత్యంత కీలకం. అతని ప్రాణాలను కాపాడుకోవాలంటే, ప్రత్యేక వైద్యం, ఇంటెన్సివ్‌‌కేర్‌ చికిత్స తప్పనిసరి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారికి ఈ పరిస్థితికి వచ్చిన వారు కేవలం 5 శాతం మంది మాత్రమే. ఇక వీరిలో కూడా రోగ నిరోధక శక్తి బాగుండి, ఇతర జబ్బులు లేకుంటే, కరోనాను సులువుగా జయించవచ్చు.

బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి సమస్యలు ముందునుంటే పట్టిపీడిస్తుంటే మాత్రం కాస్త ప్రమాదకరమే. అలా కాకుండా ముదిమి వయసు అంటే 60 ఏళ్లు దాటిన వారు ఈ స్థితికి చేరుకున్నా ప్రమాదకరమే.. ఈ వయసులో కూడా కరోనాను జయించినవారున్నారు. దీంతో కరోనాను ఏ వయసులో అయినా జయించవచ్చన్న సంగతి నిర్ధారితమైంది. ఇంతకీ కరోనాను ఎలా జయించవచ్చు. కరోనా లక్షణాలు కనబడగానే ముందుగా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. పరిస్థితి తీవ్రంగా మారుతుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి. దేశ వ్యాప్తంగా కరోనాపై అప్రమత్త, అత్యయిక స్థితి కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాలు కరోనా చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశాయి.

నిష్ణాతులైన వైద్య సిబ్బందిని కూడా నియమించాయి. ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాట్లు చేశాయి. క్వారంటైన్‌లు ఏర్పాటు చేశారు. చికిత్స వరకు వెళ్లే రోగులను వైద్యులే ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతారు. కానీ ఇళ్లలో చేయాల్సిందేంటంటే.. గొంతునొప్పి, జలుబు వంటి లక్షణాలు బయటపడితే ప్రతి ఇంట్లో రుమాళ్లు వినియోగిచవచ్చు. వాడిన రుమాళ్లను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. సలసల కాగే నీటిలో వాటిని నానబెట్టి డెటాల్ వంటివి వినియోగించి జాడించాలి. మాస్కుల వంటి వాటిని జాగ్రత్తగా నిల్వ చేసి తగులబెడితే వాటిని ఎవరూ ముట్టుకునే అవకాశం ఉండదు.

చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దేనిని ముట్టుకున్నా చేతులు శుభ్రం చేసుకోవాలి. సాధారణ సబ్బుతో అయితే 1 నిమిషం పాటు చేతులు రుద్దుకుని కడుక్కోవాలి. శానిటైజర్లతో చేతిని శుభ్రం చేసుకుంటే మరోసారి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుంటే కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. ప్రజలు స్వచ్ఛందంగా నియంత్రణ విధించుకుంటే కరోనా నుంచి రక్షణ పొందవచ్చు.

కరోనాకు విరుగుడును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అమెరికాలో కోరాన టీకా క్లినికల్ ట్రయల్స్ నేటి నుంచి ప్రారంభిస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 45 మందిపై దీనిని ప్రయోగిస్తారు. ప్రస్తుతం ఒక వ్యక్తిపై దీనిని పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది విజయవంతమైతే కరోనా విరుగుడు అందుబాటులోకి వచ్చినట్టే. మరికొన్ని దేశాలు కూడా కోరానాకు విరుగుడు కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి.

Advertisement

Next Story