విద్యుత్ శాఖ బాగా వాడేశారంటే.. బిల్లు బాదేశారంటున్నారు!

by srinivas |   ( Updated:2020-05-06 09:47:46.0  )
విద్యుత్ శాఖ బాగా వాడేశారంటే.. బిల్లు బాదేశారంటున్నారు!
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏప్రిల్ నెలలో గృహ విద్యుత్ భారీగా వినియోగించారని విద్యుత్ శాఖ పేర్కొంది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటంతో విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ శాఖ తెలిపింది. గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించి ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే మార్చి, ఏప్రిల్ మాసాల్లో వినియోగం 46:54 నిష్పత్తిలో ఉందని పేర్కొంది.

ఏప్రిల్ విద్యుత్ బిల్లు మీటర్ రీడింగ్ ద్వారా తీయలేదని తెలిపింది. ఏప్రిల్ నెల విద్యుత్ వినియోగంలో 4 శాతం మేర మార్చి నెల బిల్లుల్లో చేర్చామని, తద్వారా ఏప్రిల్ నెల బిల్లు శ్లాబు తగ్గిందని విద్యుత్ శాఖ వెల్లడించింది. 2020-21లో ఏ నెలకు ఆ నెల విద్యుత్ వాడకంపైనే శ్లాబ్ రేటు ఉంటుందని, అందుకే, ఏప్రిల్‌లో అసలు వినియోగం కంటే తక్కువ బిల్లులు వచ్చాయని విద్యుత్ శాఖ వెల్లడించింది. మార్చిలో విద్యుత్ వాడకం నాలుగు శాతం అదనంగా చేరడం వల్ల శ్లాబు రేటు పెరగలేదని చెప్పింది. మార్చి, ఏప్రిల్ మాసాల విద్యుత్ బిల్లుల పూర్తి వివరాలను వినియోగదారులకు ఎస్ఎంఎస్ చేస్తామని విద్యుత్ శాఖ వివరించింది.

విద్యుత్ శాఖ వాదం అలా ఉంటే… వినియోగదారుల వాదం మరోలా ఉంది. బిల్లులు ఎక్కువ వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా యావరేజ్ బిల్లుతో లెక్కకట్టి వసూలు చేసిన విద్యుత్ శాఖాధికారులు.. వసూలు చేసిన బిల్లుల మొత్తాన్ని మీటర్ రీడింగ్‌ మెషీన్‌లో ఎంటర్ చేయకపోవడంతో.. ఈనెల తీసిన మీటర్ రీడింగ్‌లు రెట్టింపు అయ్యాయని మండిపడుతున్నారు. దీంతో వంద యూనిట్లు వాడుకుంటే.. గత నెలది మొత్తం కలిసి 200 యూనిట్లకు బిల్లులు వస్తున్నాయని చెబుతున్నారు.

దీంతో రీడింగ్ మొత్తానికి బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని, టారీఫ్‌లు కూడా అమాంతం మారిపోవడంతో 500 రూపాయలు కట్టాల్సిన వినియోగదారుడు, 1,500 రూపాయాల బిల్లు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నాడు. లాక్‌డౌన్ ఇబ్బందులకు తోడు ఇలాంటి శాఖాపరమైన తప్పిదాలకు కూడా తామే బలౌతున్నామని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

tags: electricity department, apseb, apepdcl, ap electricity, electric bill

Advertisement

Next Story

Most Viewed