బుద్ధవనంలో బయటపడిన రాతియుగపు ఆనవాళ్లు

by Shyam |   ( Updated:2021-12-05 06:21:10.0  )
Buddhavanam
X

దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ పరిసరాలల్లో రాతియుగపు ఆనవాళ్లు మరోసారి బయటపడ్డాయని పురావస్తు పరిశోధకులు, బుద్ధవనం బౌద్ధ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బుద్ధవనం పరిసరాలలో వాకింగ్ ట్రాక్‌ను పరిశీలిస్తున్న సమయంలో ఈ ఆనవాళ్లు బయటపడ్డాయని పేర్కొన్నారు. కృష్ణాతీరంలో నాలుగు చోట్ల మధ్య రాతియుగపు సూక్ష్మ రాతి పనిముట్లు, కొత్త రాతియుగపు గొడ్డళ్లు, సాన దీసిన గుంటలు, ఒడిష రాళ్లు అరగదీసిన ఆనవాళ్లు వెలుగు చూశాయని శివనాగిరెడ్డి చెప్పారు.

గతంలో నాగార్జున కొండ పరిసరాలలో రాతియుగపు ఆనవాళ్ల బయల్పడ్డాయన్నారు. ఈ కొత్త ఆనవాళ్లను పరిశీలిస్తే.. ఈ ప్రాంతం ఆదిమానవులు కార్యస్థావరంగా ఉండేదని, నదితీరాన వేటకు వెళ్లేందుకు, ఆహార సంపాదనకు అనువుగా ఉండేదని ఆయన తెలిపారు. కొత్త రాతియుగపు ఆనవాళ్లు ఉన్న వాకింగ్ ట్రాక్‌ పైన ఆర్కలాజికల్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేయవచ్చని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ఓఎస్డీ సుధన్ రెడ్డి, బుద్ధవనం ఎస్ఈ క్రాంతిబాబు, బుద్ధవనం డిజైన్ ఇన్చార్జి శ్యామ్ సుందర్ రావు, నరసింహారావు పాల్గొన్నారు.

Advertisement

Next Story