నిఘా నీడలో ‘భగీరథ’

by Shyam |
నిఘా నీడలో ‘భగీరథ’
X

మిషన్ భగీరథ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ప్రాజెక్టు ఎంత వరకు పూర్తయింది? కనెక్టివిటీ ఎలా ఉంది? ప్రజలు ఏ మేరకు ఈ నీటిని వాడుకుంటున్నారు ? ఆర్‌డబ్లూఎస్ అధికారులిచ్చిన నివేదికల్లో వాస్తవికత ఎంత ? తదితర సమగ్రమైన అంశాలపై నివేదికలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిఘా వర్గాలను ఆదేశించింది. దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మిషన్ భగీరథ పనుల గురించి ఆరా తీస్తున్నాయి. ఈ పథకానికి సంబంధించిన పైప్ లైన్ల నిర్మాణం, ఇంటింటికి నల్లాల బిగింపు వంటి పనులు పూర్తయినప్పటికీ చాలా చోట్ల ఓవర్ హెడ్ వ్యాటర్ ట్యాంకులను అనుసంధానం చేయనట్టు తెలుస్తోంది. అయితే మిషన్ భగీరథ నీరు తాగితే ఒళ్లంతా దురద పెడుతోందని చాలా చోట్ల ప్రజలు ఈ నీటిని వినియోగించేందుకు విముఖత చూపిస్తున్నారని సమాచారం. సొంతంగా ఏర్పాటు చేసుకున్న వాటర్ ప్యూరిఫైర్లపై లేదా సంప్రదాయ పద్ధతులను ఆశ్రయిస్తున్నారని తేలింది. ఈ విషయాల ఆధారంగా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని నిఘా వర్గాలు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మిషన్ భగీరథతో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడం లేదని ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. కాగా..ఇప్పటి వరకు ప్రభుత్వానికి అందిన నివేదికలను బట్టి ఈ పథకం ద్వారా శాశ్వత ప్రాతిపాదికన నీరందించేందుకు తీసుకోవాల్సి చర్యలపై ఓ నిర్ణయం తీసుకుని, మిషన్ భగీరథకు మెరుగులు దిద్దే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు పూర్తి కాని ప్రాంతాల్లో డెడ్ లైన్లు విధించడం, ఓవర్ హెడ్ ట్యాంకులతో అనుసంధానం చేసి క్రమపద్ధతిలో స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed