కేబినెట్ కీలక నిర్ణయం.. పటాన్‌చెరు ప్రజలకు గుడ్ న్యూస్..

by Shyam |
MLA-Mahipal-Reddy
X

దిశ, పటాన్‌చెరు : పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల కల సాకారమైంది. బోనాల పండుగ పర్వదినాన ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు అందించారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పటాన్‌చెరు పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

గత ఎనిమిది నెలలుగా ఆసుపత్రి ఏర్పాటుకు పట్టువదలని విక్రమార్కుడుగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన కృషి ఫలించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పటాన్‌చెరు నియోజకవర్గ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలపడం పట్ల శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు.

కార్మికులు, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే పటాన్‌చెరు నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయలతో 270 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం నియోజకవర్గ చరిత్రలోనే సంచలనం నిర్ణయమని అన్నారు. నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించిన రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి తన్నీరు హరీశ్ రావు, శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వైద్య విభాగం అధికారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆసుపత్రి ఏర్పాటుపై నిరంతరం తమ కథనాలతో ప్రజలకు సమాచారం అందించిన మీడియాకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed