ఎట్టకేలకు ఆ మార్కెట్‌కు మోక్షం!

by Shyam |
ఎట్టకేలకు ఆ మార్కెట్‌కు మోక్షం!
X

దిశ, రంగారెడ్డి: ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న పండ్ల మార్కెట్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించారు. నేటి(సోమవారం) నుంచి మార్కెట్‌కు సరుకును తరలిస్తున్నారు. క్రయవిక్రయాలు, లావాదేవీలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. కోహెడ గ్రామ రెవెన్యూ పరిధిలో మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు 178 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం అప్పట్లో కేటాయించింది. ప్రస్తుతం రూ.50 లక్షల వ్యయంతో అత్యవసరమైన నిర్మాణాలు చేపట్టారు. తాత్కాలికంగా కోహెడ మార్కెట్లో మామిడి, నిమ్మకాయలను కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి స్థాయి మార్కెట్‌గా అవతరించనున్నది. గడ్డిఅన్నారం మార్కెట్‌ను కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మూసేసిన
విషయం తెలిసిందే.

సమస్యలకు చెక్…

గడ్డి‌అన్నారం మార్కెట్‌ ముందే మెట్రో రైల్‌‌స్టేషన్‌ ఉండటంతో వ్యాపారులకు, వినియోగదారులకు ఇబ్బందిగా ఉండేది. వాహనాల రాకపోకలతో ఆ ప్రాంతవాసులు నగరవాసులు, వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యలన్నింటికీ మార్కెట్ తరలింపుతో పరిష్కారం దొరికింది.

ఆ మార్కెట్‌ ఇలా ఉండేది…

1986లో ఏర్పాటైన గడ్డి అన్నారం మార్కెట్‌ను 22 ఎకరాల సువిశాల స్థలంలో ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌గా తీర్చిదిద్దారు. ఇందులో 97 పెద్ద దుకాణాలు, 77 చిన్న దుకాణాలు నాలుగు ప్లాట్‌ఫారాల్లో వ్యాపారం కొనసాగేది. మార్కెట్ ఆవరణలో ఒక కోల్డ్ స్టోరేజి, రైపింగ్ చాంబర్, రెండు వే బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ ఎంట్రీ విధానం ఇక్కడి ప్రత్యేకత. సుమారు 2 వేల కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాయి. ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి పండ్ల వ్యాపారులు క్రయవిక్రయాల నిమిత్తం వచ్చేవారు. ప్రతిరోజు మార్కెట్‌లో రూ.12 కోట్ల వరకు లావాదేవీలు జరిగేవి. మార్కెట్‌కు రూ.10 లక్షల వరకు ఆదాయం వచ్చేది.

కొత్త మార్కెట్ ఏర్పాట్లు పరిశీలన..

గురువారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నందున సోమవారం నుంచి మార్కెట్‌కు వచ్చే మామిడి సరుకును కోహెడకు తరలిస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ వి.రామ్‌నర్సింహగౌడ్ తెలిపారు. ఇక్కడి ఏర్పాట్లను ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ ఎమ్మెల్యే లు కిషన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డిలతోపాటు రాచకొండ సీపీ మహేష్ భగవత్, మార్కెటింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.

tags: Ranga Reddy, koheda, gaddiAnnaram, fruit market, authorities, start

Advertisement

Next Story