తప్పును తప్పని చెప్పలేరా..? ఎందుకీ మౌనం!

by Sujitha Rachapalli |   ( Updated:2021-05-08 11:04:52.0  )
తప్పును తప్పని చెప్పలేరా..? ఎందుకీ మౌనం!
X

దిశ, ఫీచర్స్ : కరోనా.. పేరు చెప్తేనే ప్రజలు గడగడలాడిపోతున్నారు. ఏ నిమిషంలో ఎక్కడి నుంచి చావు వార్త వినాల్సి వస్తుందో అని వణికిపోతున్నారు. ఇంట్లో ఉన్న కొవిడ్ రోగుల అవస్థలు చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆస్పత్రికెళ్తే బెడ్ దొరకదు, అత్యవసరంలో ఆక్సిజన్ అందదు, ఇక మందుల సంగతి సరేసరి! కనీసం చనిపోయిన శవాన్ని కాల్చుదామంటే శ్మశానంలో చోటు ఉండదు. ఇంటింటికో కన్నీటి గాథ, మనిషి మనిషికో వ్యథ. పైసలుంటే హాస్పిటల్‌కు.. లేదంటే శ్మశానవాటికకు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. కుటుంబాలకు కుటుంబాలు మట్టిలో కలుస్తున్నా.. అడిగే దిక్కు లేదు. దహన సంస్కారాలకైనా తోడొచ్చే మనుషులు లేరు. ఇలాంటి భయానక, దుర్భర పరిస్థితికి భారత్ సాక్షీభూతంగా నిలుస్తోంది. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వమే కదా! ముందు చూపులేని పాలనే కదా! వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న నిర్లక్ష్యమే కదా! ఈ దారుణ మారణహోమం ఆ నిర్లక్ష్యానికి ప్రతిఫలమే కదా?

అయినా సరే, ప్రభుత్వాన్ని ఎంత మంది ప్రశ్నిస్తున్నారు. గవర్నమెంట్‌ను నిలదీయాల్సిన బాధ్యత కేవలం ప్రతిపక్షానిదేనా? సమాజంలో ప్రముఖులుగా చెలామణి అవుతున్న సినీస్టార్లకు లేదా? ప్రజలు ఆదరిస్తేనే కదా! ఆ స్టార్ అనే మెట్టుకు ఎదిగింది. మైకులు పట్టుకుంటే చాలు ‘ప్రేక్షకులే దేవుళ్లు’ అంటూ స్పీచ్‌లు దంచే సెలబ్రిటీలు.. ఆ దేవుళ్లు కష్టాల్లో ఉంటే స్పందించరా? వారి తరపున వకాల్తా పుచ్చుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరా? ‘ఫండ్ రైజ్ చేద్దాం.. అన్నదానం చేద్దాం.. అందరం కలిసి పోరాడి కరోనాను జయిద్దాం!’ లాంటి సేవాకార్యక్రమాలు ఓకే. మరి అసలు తప్పును ఎందుకు ఎత్తి చూపడం లేదు? అంటే సర్కార్ కారణంగా మారణహోమం జరిగినా సరే.. ఎప్పుడూ ఇలా మౌనంగానే ఉంటారా? మాకెందుకులే అని చేతులు ముడుచుకుని కూర్చుంటారా? ప్రజల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యంపై గొంతు విప్పరా? ఎందుకు.. సర్కార్‌ను వ్యతిరేకిస్తే భవిష్యత్ అంతర్ధానమైపోతుందనే భయమా? లేక అవార్డులు పొందలేమనే గుబుళా? ఏది మిమ్మల్ని ఆపుతోంది? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఇండియన్ ఇండస్ట్రీ.. లక్షల మంది స్టార్స్.. కోట్లల్లో రెమ్యునరేషన్.. కానీ అభిమానానికి ఆపదొస్తే జీరో రెస్పాన్స్. అయితే ఈ లక్షల తారల్లో సూర్యచంద్రుల్లా.. కొందరు స్టార్స్ మాత్రం తమ గళాన్ని విప్పుతున్నారు. మౌనాన్ని వీడి మోడీని ప్రశ్నిస్తున్నారు. మాకు కావాల్సింది జనం బాగోగులు తప్ప.. సర్కార్ అండదండలు, అవార్డులు, రివార్డులు కాదని తప్పును నిక్కచ్చిగా ఎత్తి చూపుతున్నారు. భారతజాతిని అంతం చేసే ప్రమాదకరస్థాయికి పరిస్థితి ఎందుకు వెళ్లిందని నిలదీస్తున్నారు. జనాల శోకాలు, దిక్కుతోచని ఆక్రందనలు వినిపిస్తున్నాయా? అని ప్రభుత్వాన్ని గద్దిస్తూ తమ అభిప్రాయాలను మీడియా, సోషల్ మీడియాలో నిర్భయంగా వెల్లడిస్తున్నారు.

ఆర్జీవీ..

తప్పును తప్పు అని చెప్పేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయని ఆర్జీవీ.. మోడీ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించాడు. కరోనా సమయంలో కుంభమేళా నిర్వహించడంపై విమర్శనాస్త్రాలు సంధించాడు. మర్కజ్ ఘటనతో పోలుస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశాడు. హిందువులు, ముస్లింల మధ్య బీజేపీ ఎలాంటి తారతమ్యం చూపుతుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరించాడు. బెడ్స్, ఆక్సిజన్, మందులు.. ఇలా ప్రతీ విషయంలో జనాలు పడుతున్న కష్టాలను సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెట్టాడు. ఇన్ని చేసినా పట్టించుకోని మోడీని బాబాతో పోల్చి, ఆయన హిమాలయాలకు వెళ్లిపోవడమే మంచిదన్న వర్మ.. ఇలాంటి పీఎం మన దేశానికి ఉండడం సిగ్గుగా ఉందని ఓపెన్‌గానే చెప్పేశాడు.

సునీల్ శెట్టి..

నిన్నటి తరం బాలీవుడ్ నటులపై ప్రేక్షకుల అభిమానం గురించి మాటల్లో వివరించలేం. ప్రాణాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడని ఫ్యాన్స్, గుండెలపై పచ్చబొట్లు వేయించుకుని ఆరాధించిన ఆరాధకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కానీ అలాంటి వారికి స్టార్స్ నుంచి అందిన ప్రతిఫలం ఏమైనా ఉందా? అంటే లేదన్న సమాధానమే. ఐపీఎల్, బిజినెస్, వెకేషన్ అంటూ ఎంజాయ్ చేశారే తప్ప.. నా జనం కష్టాల్లో ఉన్నారు, పట్టించుకుందామన్న వాళ్లే లేరు. నా అభిమానులు అనుకుని ముందుకొచ్చి సేవలందిస్తున్న హీరో సునీల్ శెట్టి.. ప్రస్తుత రాజకీయ నాయకులు తమను (మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్స్) ప్రతీ అవసరానికి పరుగెత్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓటు కోసం జనాల చుట్టూ తిరిగే నాయకులు.. వ్యవస్థకు ఎలాంటి సేవలు అందిద్దామనే విషయాన్ని మరిచి, ఎంత సంపాదిద్దామనే విషయంపై కాన్సంట్రేట్ చేశారని మండిపడ్డారు. కానీ ఈ సారి గుర్తుపెట్టుకోండి.. ఓట్ల కోసం మా చుట్టూ పరుగులు పెట్టిస్తామంటూ నాయకులను హెచ్చరించాడు.

సిద్ధార్థ్..

ముందుచూపులేని మోడీ పాలనే.. దేశాన్ని కరోనాతో అల్లాడే పరిస్థితికి తీసుకొచ్చిందని ఫైర్ అయ్యాడు హీరో సిద్ధార్థ్. కొవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో బీజేపీ సర్కార్ ఫెయిలైందని, దీనికి సమాధానం చెప్పాలన్నాడు. నిజానికి ఇక మోడీకి మళ్లీ టీస్టాల్ పెట్టుకునే టైమ్ వచ్చిందని, రిజైన్ చేస్తే బాగుంటుందని కూడా డిమాండ్ చేశాడు. అటు ఆక్సిజన్ కొరత గురించి మాట్లాడితే శిక్ష తప్పదని ప్రకటించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై నిప్పులు చెరిగిన సిద్ధు.. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ మూకలు చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినా వెనక్కి తగ్గలేదు.

వీర్ దాస్..

స్టాండప్ కమెడియన్ వీర్ దాస్.. ఒక్క గవర్నమెంట్‌ను మాత్రమే కాదు కాంగ్రెస్, ఆప్, యంగ్ పొలిటీషియన్స్, మీడియా, సినీ స్టార్స్, క్రికెటర్స్, పీపుల్ అందరినీ ఏకిపడేశాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని పెన్సిల్‌తో పోల్చిన వీర్ దాస్.. తమ ఫ్యూచర్ బాగుండేందుకు తెరమీద, తెరవెనుక కూడా యాక్టింగ్ చేస్తారని సెటైర్స్ వేశాడు. కనీసం ఇప్పుడైనా జీవమున్న ప్రాణుల్లా బతకండని సలహా ఇచ్చాడు.

సోను సూద్..

రియల్ హీరో.. లాక్ డౌన్ స్టార్.. ఇవి కాదు సోను సూద్ గురించి చెప్పాల్సిన మాటలు. ‘ఆయనొక వ్యవస్థ, 24 గంటలు అందుబాటులో ఉండే ప్రభుత్వం’.. ఇవి ప్రజలు చెప్పిన మాటలు. ఆక్సిజన్ సిలిండర్లు, మందుల గురించి నేతలకు ఎన్ని రిక్వెస్ట్‌లు వెళ్తున్నాయో తెలియదు కానీ.. సోను అండ్ టీమ్‌కు మాత్రం వేలల్లో రిక్వెస్ట్‌లు అందుతున్నాయి. వీటిపై నిమిషాల్లో స్పందిస్తూ ఇప్పటికే వేల ప్రాణాలు నిలిపిన సోను.. ప్రజల తరపున చాలాసార్లు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశాడు. కరోనా సమయంలో విద్యార్థుల ప్రవేశ పరీక్షలు, కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన పిల్లల భవిష్యత్తు గురించి సర్కార్‌కు సజెషన్స్ ఇస్తూనే.. వ్యక్తిగతంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. 2024 భారత ప్రధానిగా సోషల్ మీడియాలో కీర్తించబడుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed