క్వారంటైన్ లీవుల కోసం సిబ్బంది ధర్నా

by Shyam |
క్వారంటైన్ లీవుల కోసం సిబ్బంది ధర్నా
X

దిశ, న్యూస్‌బ్యూరో: నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు క్వారంటైన్ లీవుల కోసం కింగ్ కోఠి ఆసుపత్రిలో ధర్నా చేశారు. కరోనా పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది వారంరోజులు పనిచేసిన తర్వాత మరోవారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండే విధానం అమలవుతోందని, కానీ తమకు మాత్రం అలాంటి వెసులుబాటు లేదని, ప్రతీరోజూ పనిచేయాల్సి వస్తోందని కార్మికులు వాపోయారు. నెలల తరబడి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ దగ్గర పనిచేస్తున్నా కరోనా పరిస్థితుల్లో మెడికల్ సిబ్బందితో పాటు వీరికి కూడా క్వారంటైన్ సౌకర్యం ఉంటుందని చెప్పినా ఆచరణలో మాత్రం అమలుకావడంలేదని, గతంలో వైద్య విద్య డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా ఎలాంటి స్పందన లేదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు నరసింహ మీడియాకు వివరించారు.

నెలరోజుల క్రితం డైరెక్టర్ డాక్టర్ రమేష్‌రెడ్డితో సమావేశం అయినప్పుడు అన్ని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కచ్చితంగా క్వారెంటైన్ లీవులు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ కిందిస్థాయి అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోలేదని, ఇప్పటికీ వారికి సెలవులు ఇవ్వలేదని వివరించారు. అడిగినందుకు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని, కొద్దిమందిని వేధిస్తున్నారని నరసింహ ఆరోపించారు. క్వారంటైన్ సెలవులు మంజూరు చేయకపోతే పనులు ఆపి సమ్మె చేయక తప్పదని ఆయన హెచ్చరించారు. వీరి విధుల బహిష్కరణతో ఆసుపత్రిలో పారిశుధ్య పనులు, పేషెంట్ కేర్ సేవలకు అంతరాయం కలగడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ చర్చలు జరిపి ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని సర్దిచెప్పడంతో తాత్కాలికంగా విధుల్లో చేరారు.

Advertisement

Next Story

Most Viewed