‘2011 వరల్డ్‌కప్‌ను శ్రీలంక అమ్మేసుకుంది'

by Shiva |
‘2011 వరల్డ్‌కప్‌ను శ్రీలంక అమ్మేసుకుంది
X

దిశ, స్పోర్ట్స్: ధోనీ సారథ్యంలో టీమ్‌ఇండియా 28ఏండ్ల తర్వాత క్రికెట్ వరల్డ్ ‌కప్‌ను సగర్వంగా గెలుచుకుంది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో ఇండియా విజయం సాధించింది. కాగా, ఆనాటి ఫైనల్‌పై శ్రీలంక మాజీ క్రీడా మంత్రి, ప్రస్తుత ఎంపీ మహీందానంద తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీలంక జట్టు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఆనాటి ప్రపంచకప్‌ను ఇండియాకు అమ్మేసుకుందని ఆరోపించారు. శ్రీలంకకు చెందిన సిరాస టీవీతో మాట్లాడుతూ 2011లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు తనకు తెలుసని చెప్పారు. అప్పుడు నేను శ్రీలంక క్రీడాశాఖ మంత్రిగా ఉన్నాను. ఆనాడే నాకు తెలిసినా దేశం మేలు కోసం ఇన్నాళ్లు బయట పెట్టలేదని అన్నారు. శ్రీలంక గెలిచే మ్యాచ్‌ను కావాలనే ఓడిపోయిందని ఆరోపించారు. నేనేం చెబుతున్నానో దానికి కట్టుబడి ఉన్నాను. ఆటగాళ్లను నిందిచడం లేదు. కానీ, కొన్ని వర్గాలు మాత్రం ఈ ఫిక్సింగ్‌లో పాలుపంచున్నాయని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం అర్జున రణతుంగ కూడా ఇదే విధంగా ఆరోపణలు చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై విచారణ జరపాలని డిమాండ్ కూడా చేశాడు. అయితే, వాటిని పనికి మాలిన ఆరోపణలని వరల్డ్ కప్ జట్టు సభ్యులైన గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా కొట్టి పారేశారు. దమ్ముంటే వాటికి సాక్ష్యాలు చూపాల్సిందిగా రణతుంగను డిమాండ్ చేశారు. కానీ, అప్పట్లో ఈ వివాదం సద్దుమణిగింది. తాజాగా శ్రీలంక ఎంపీ ఆరోపణలతో ఆనాటి ఫైనల్స్ మరోసారి తెరపైకి వచ్చింది.

Advertisement

Next Story