రాష్ట్రానికి చేరుకున్న స్పుత్నిక్-వి టీకాలు.. మొదట వేసేది వారికే..

by Shyam |   ( Updated:2021-05-16 11:46:01.0  )
రాష్ట్రానికి చేరుకున్న స్పుత్నిక్-వి టీకాలు.. మొదట వేసేది వారికే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇప్పటివరకూ దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల పంపిణీ మాత్రమే జరుగుతుండగా ఇకపైన రష్యాకు చెందిన స్పుత్నిక్-వి కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే తొలి డోస్‌ను కస్టమ్ ఫార్మా హెడ్‌కు రెండు రోజుల క్రితం ఇవ్వగా లాంఛనంగా సోమవారం నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానుంది. ఫస్ట్ ఫేజ్‌లో దేశంలోని అపోలో ఆస్పత్రుల్లో రెడ్డీస్ లాబ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు పైలట్ ప్రాతిపదికన స్పుత్నిక్-వి టీకాల పంపిణీ జరగనుంది. ఒక్కో డోసు ధరను రూ. 995 చొప్పున ప్రకటించిన రెడ్డీస్ లాబ్ దశలవారీగా దిగుమతి చేసుకుని మోతాదునుబట్టి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా ప్రజలకు ఇవ్వనుంది.

హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రితో పాటు దేశంలోని పలు శాఖల్లో కూడా రెడ్డీస్ లాబ్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు టీకాల పంపిణీని మొదలు పెట్టనుంది. స్పుత్నిక్ టీకాల పంపిణీ గురించి రెడ్డీస్ లాబ్ సీఈఓ ఎంవీ రమణ, అపోలో ఆస్పత్రి ప్రెసిడెంట్ డాక్టర్ హరి ప్రసాద్ జూబ్లీహిల్స్ ఆస్పత్రిలో మీడియాకు వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతానికి స్పుత్నిక్-వి టీకాలను దిగుమతి మాత్రమే చేసుకుంటున్న రెడ్డీస్ లాబ్ త్వరలో దేశంలోనే తయారు చేయడానికి ఆరు వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంటోంది.

ఇప్పటికే చేరుకున్న రెండు లక్షల డోసులు..

రష్యా నుంచి తొలి దశలో ఇటీవల ఒకటిన్నర లక్షల డోసులు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా ఆదివారం మరో 60 వేల డోసులు చేరుకున్నాయి. తక్కువ మోతాదులో దిగుమతి అయినందున కేంద్ర ప్రభుత్వం వీటిని ఏయే రాష్ట్రాలకు ఎంత మొత్తంలో కేటాయించినున్నదీ త్వరలో వెల్లడవుతుంది. అపోలో ఆస్పత్రులు ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను వినియోగిస్తుండగా ఇప్పుడు రెడ్డీస్ లాబ్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇకపైన స్పుత్నిక్-వి టీకాలను కూడా ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే స్పుత్నిక్-వి టీకా వినియోగానికి అనుమతి మంజూరు చేయడంతో త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Advertisement

Next Story

Most Viewed