అందరినీ సంతోషంగా ఉంచలేం : టీ20 వరల్డ్ కప్‌ జట్టుపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Harish |
అందరినీ సంతోషంగా ఉంచలేం : టీ20 వరల్డ్ కప్‌ జట్టుపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : మరో ఐదు నెలల్లో టీ20 వరల్డ్ కప్‌ సంబరం మొదలుకానుంది. ఇప్పటికే అన్ని జట్లు సన్నద్ధత మొదలుపెట్టేశాయి. టీమ్ ఇండియా సైతం ఈ పొట్టి ప్రపంచకప్‌పై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపిక చర్చనీయాంశంగా మారింది. జట్టులో చోటు కోసం భారీ పోటీ నెలకొంది. ఒక్కో స్థానానికి ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో టీ20 మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ప్రపంచకప్‌కు ప్రతిభావంతులైన ప్లేయర్లను ఎంపిక చేయకపోవడం క్రికెట్‌ స్వభావమని చెప్పాడు. ‘కొంతకాలంగా మేము టీ20ల్లో చాలా మంది యువకులను ప్రయత్నించాం. వాళ్లు రాణించారు కూడా. అయితే, ప్రధాన జట్టులో కొందరికి చోటు దక్కకపోవచ్చు. అది, వారిని నిరాశపరుస్తుంది. కానీ, జట్టుపై క్లారిటీ తీసుకరావడమే మా పని. మాకున్న 25-30 మంది ప్లేయర్లలో వారి నుంచి ఏం ఆశిస్తామో వారికి తెలుసు. ఇంకా టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ఖరారు చేయలేదు. కానీ, మైండ్‌లో 8-10 మంది ప్లేయర్లు ఉన్నారు. వెస్టిండీస్ పరిస్థితుల ఆధారంగా జట్టును ఎంపిక చేస్తాం. రాహుల్ భాయ్, నేను జట్టుపై క్లారిటీ రావడానికి ప్రయత్నిస్తున్నాం. కెప్టెన్‌గా నేను నేర్చుకున్నది ఏంటంటే.. అందరినీ సంతోషం పెట్టలేం. జట్టు అవసరాలపై మాత్రమే దృష్టి పెట్టాల్సి ఉంటుంది.’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా, పొట్టి ప్రపంచకప్‌కు ముందు టీమ్ ఇండియా.. ఆఫ్ఘనిస్తాన్‌తో చివరి అంతర్జాతీయ సిరీస్ ఆడేసింది. 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఉత్కంఠగా సాగిన మూడో టీ20లో భారత జట్టు రెండో సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement

Next Story

Most Viewed