డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఢీ

by Mahesh |   ( Updated:2023-02-15 03:39:02.0  )
డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఢీ
X

న్యూఢిల్లీ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది. అరంగేట్ర సీజన్‌ కోసం అన్ని ప్రక్రియలను పూర్తి చేసిన బీసీసీఐ మంగళవారం లీగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. మార్చి 4 నుంచి 26 తేదీల మధ్య ప్రారంభ సీజన్ జరుగుతున్నట్టు వెల్లడించింది. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్‌తో టోర్నీ షురూ కానుంది. మార్చి 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

22 మ్యాచ్‌లు.. ఐదు జట్లు

తొలి సీజన్‌లో ఐదు జట్లు పాల్గొంటున్నాయి. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ పోటీలో ఉంటాయి. టోర్నీలో 22 మ్యాచ్‌లు జరగనున్నట్టు బోర్డు తెలిపింది. ఇందులో లీగ్ స్టేజ్‌లో 20 మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 5, 18, 20, 21 తేదీల్లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలుకానుండగా.. రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.

లీగ్ దశలో ఒక్కో జట్టు 8 మ్యాచ్‌లు ఆడనుంది. ప్రతి జట్టు ఇతర జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. మార్చి 24న ఎలిమినేటర్ మ్యాచ్, 26వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. లీగ్ స్టేజ్‌లో టాప్‌‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకునేందుకు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయి.

ముంబై ఏకైక వేదిక

తొలి సీజన్‌కు ముంబై ఏకైక వేదిక కానుంది. ముంబై వేదికగానే అన్ని మ్యాచ్‌లు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండు స్టేడియాల్లో 11 మ్యాచ్‌ల చొప్పున జరగనున్నాయి. మార్చి 26న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు బ్రబౌర్న్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

ఇవి కూడా చదవండి : ప్రేమికుల రోజున రెండోసారి గ్రాండ్‌గా వివాహం చేసుకున్న హార్దిక్ పాండ్యా

Advertisement

Next Story

Most Viewed