రోహిత్ శర్మ వారసుడెవరు?

by Hajipasha |
రోహిత్ శర్మ వారసుడెవరు?
X

టీ20 ప్రపంచకప్ సాధించిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా సైతం టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో తదుపరి రోహిత్ శర్మ వారసుడు ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. భవిష్యత్‌లో టీమిండియాకు ఎవరు నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకే జట్టు కెప్టెన్సీగా బాధ్యతలు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ ఇతరులకు సైతం చాన్స్ దక్కే అవకాశం లేకపోలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దిశ,స్పోర్ట్స్ : గతంలో విరాట్ కోహ్లీ టీ20 జట్టుకు కెప్టెన్సీ చేసి జట్టును విజయపథంలో నడిపించారు.అయితే, కోహ్లీ నుంచి నాయకత్వ బాధ్యతలు అందుకున్న రోహిత్.. 2022 టీ20 ప్రపంచకప్ ఓడిపోవడంతో అతని కెప్టెన్సీపై అనేక సందేహాలు నెలకొన్నాయి.దీంతో రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా టీ20 కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.దీంతో ఇక పాండ్యా జట్టును ముందుండి నడిపిస్తారని అంతా భావించారు. ఎందుకంటే దానికి ముందు ఐపీఎల్లో గుజరాత్ జట్టుకు కెప్టెన్సీ చేసిన పాండ్యా తొలి సీజన్‌లోనే ఆ జట్టుకు టైటిల్ అందించాడు. ఆ నమ్మకంతోనే బీసీసీఐ పాండ్యాకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది.

వన్డే వరల్డ్ కప్ ఓటమితో..

టీమిండియా వన్డ్ వరల్డ్ కప్‌ను త్రుటిలో చేజార్చుకుంది. అప్పుడు హార్దిక్ పాండ్యా తీవ్రమైన ఫిట్‌నెస్, ఫాంలేమీతో ఇబ్బందిపడ్డాడు. దీంతో అప్పటికే అద్భుతమైన ఫాంలో ఉన్న రోహిత్ శర్మకు టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని తిరిగి నాయకత్వ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది.టీ20 వరల్డ్ కప్ కోసం తుది జట్టు ఎంపికకు ముందు కూడా పాండ్యా అసలు జట్టులో ప్లేస్ దక్కించుకుంటాడా? అని అంతా అనుమానం వ్యక్తంచేశారు.ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ కెప్టెన్సీ చేశాడు.ఈ 17 సీజన్‌లో ముంబై జట్టు దారుణంగా విఫలమైంది.రోహిత్ శర్మ‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ముంబై ఇండియన్స్ అభిమానులు పాండ్యాను దారుణంగా ట్రోల్స్ చేశారు. ఫిట్నెస్ లేదని, కెప్టెన్సీ ఎలా చేయాలో తెలియడం లేదని విమర్శలు గుప్పించారు.కానీ, పాండ్యా ఆల్ రౌండర్ కావడంతో ఆయన్ను ప్రపంచకప్ తుదిజట్టులో ఎంపిక చేయడం, టోర్నీలో అతడు అద్భుతంగా రాణించడం, ఫైనల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొన్నటివరకు అతన్ని తిట్టిన వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు.

వైస్‌కెప్టెన్‌ వైపే బీసీసీఐ మొగ్గు!

ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నారు. అయితే, ఫుల్ టైమ్ కెప్టెన్సీ‌గా అతనికే బాధ్యతలు దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.గతంలో ఐపీఎల్‌లో గుజరాత్ జట్టును విజయపథంలో నడిపించిన అనుభవం అతనికి కలిసిరానుంది. అయితే, సెలక్టర్లు మాత్రం మిగతా ఆటగాళ్లవైపు చూసే అవకాశం లేకపోలేదు. ఇక పాండ్యాకు అటు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ నుంచి కూడా పోటీ నెలకొనే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

బుమ్రా, సూర్య ప్రదర్శనపై ప్రభావం..

ఒకవేళ సీనియారిటీ ప్రకారం చూసుకుంటే జట్టులో జస్ప్రిత్ బుమ్రా సూపర్ సీనియర్. గతంలో ఐర్లాండ్ పర్యటనలో బుమ్రా జట్టుకు నాయకత్వం వహించాడు. వివాద రహితుడిగా అతడికి పేరుంది. కెప్టెన్సీగా కూడా బాగానే చేశాడు.అయితే, బౌలర్‌కు కెప్టెన్సీ ఇచ్చిన దాఖలాలు భారత జట్టు చరిత్రలో చాలా తక్కువ. ఒకవేళ ఫుల్ టైం కెప్టెన్సీకి బుమ్రాకి ఇస్తే ఆ ఒత్తిడికి తన బౌలింగ్ ప్రదర్శనపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఇకపోతే మిడిలార్డర్లో వచ్చే సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ బ్యాటర్. అతనికి ఇస్తే ఒత్తిడిని తట్టుకుని జట్టును విజయపథంలో నడిపిస్తాడా? తన బ్యాటింగ్‌పై కూడా ప్రభావం పడుతుందా? అనేది సెలక్టెర్లు పరిగణలోకి తీసుకోవచ్చు.పంత్ విషయానికొస్తే టాపార్డర్ లో అటు బ్యాటింగ్, వికెట్ కీపింగ్.. గతంలో ధోని సైతం వికెట్ కీపింగ్ చేస్తూనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి సక్సెస్ అయ్యాడు. ఫలితంగా తన పరుగులపై తీవ్ర ప్రభావం పడింది. కానీ, జట్టుకు రెండు వరల్డ్ కప్‌లు అందించాడు. పంత్ ప్రజెంట్ ఐపీఎల్లో ఢిల్లీ జట్టుకు విజయవంతంగా కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఇక గిల్ యంగ్ అండ్ డైనమిక్.. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో జట్టుకు అతనే కెప్టెన్. అందులో సక్సెస్ అయితే మనోడికి కూడా చాన్సెస్ ఉంటాయి. గిల్ ఐపీఎల్లో గుజరాత్ జట్టుకు సారధ్యం వహిస్తున్నా అంతగా సక్సెస్ కాలేకపోయాడు.కాగా, రోహిత్ శర్మ తదుపరి వారుసుడెవరనేది త్వరలోనే తేలనుంది. దీనిపై ఇప్పటికే బీసీసీఐ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చాకే టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన ఉంటుందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed