Marlon Samuels: అవినీతి కేసులో దోషిగా వెస్టిండీస్ మాజీ క్రికెట‌ర్..

by Vinod kumar |
Marlon Samuels: అవినీతి కేసులో దోషిగా వెస్టిండీస్ మాజీ క్రికెట‌ర్..
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ మాజీ క్రిక‌టెర్ మ‌ర్లోన్ శామ్యూల్స్ అవినీతి కేసులో దోషిగా తేలాడు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాంటీ క‌రప్షన్ కోడ్ ప్రకారం.. నాలుగు నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌కు పాల్పడిన‌ట్టు శామ్యూల్స్ అంగీక‌రించాడు. 2021 సెప్టెంబ‌ర్‌లో ఈ స్టార్ క్రికెట‌ర్‌పై అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఐసీసీ కేసు న‌మోదు చేసింది. రెండేళ్ల తర్వాత ఈ విండీస్ మాజీ ఆట‌గాడు త‌న నేరాన్ని కోర్టు స‌మ‌క్షంలో ఒప్పుకున్నాడు. అత‌డికి ఎలాంటి శిక్ష వేయాల‌నే దానిపై త్వరలోనే నిర్ణయం వెలువ‌డ‌నుంది.

రెండేళ్ల క్రితం ఈ ఆల్‌రౌండ‌ర్ త‌న‌కు వ‌స్తు, ధ‌న రూపంలో ముట్టిన కానుక‌ల గురించి అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు చెప్పలేదు. బ‌స చేసిన హోట‌ల్ బిల్లు 750 అమెరికా డాల‌ర్లు అంటే రూ. 62,362కు సంబంధించిన పేప‌ర్‌ను దాచిపెట్టాడు. అంతేకాదు కేసు విచార‌ణ చేప‌ట్టిన‌ అధికారుల‌కు స‌హ‌క‌రించ‌లేదు. పైగా విచార‌ణ‌ ఆల‌స్యానికి కార‌ణ‌మ‌య్యాడు. గ‌తంలోనూ శామ్యూల్స్ ఇదే త‌ర‌హా ప్రవ‌ర్తన‌తో వార్తల్లో నిలిచాడు. 2007లో మ్యాచ్ స‌మాచారాన్ని ఆన్‌లైన్ స్పోర్ట్స్‌బుక్ వాళ్లకు చెప్పాడు.

శామ్యూల్స్ 18 ఏళ్ల పాటు జాతీయ జ‌ట్టుకు ఆడాడు. శామ్యూల్స్ రెండు సార్లు టీ20 ప్రపంచ క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడు. 2012, 2016లో క‌రీబియ‌న్ జ‌ట్టు పొట్టి ప్రపంచ‌ క‌ప్ గెల‌వడంలో శామ్యూల్స్ కీల‌క పాత్ర పోషించాడు. త‌న కెరీర్‌లో 71 టెస్టులు, 207 వ‌న్డేలు, 67 టీ20ల్లో క‌లిపి 11,134 ప‌రుగులు చేశాడు. బంతితోనూ రాణించి 152 వికెట్లు తీశాడు.

Advertisement

Next Story

Most Viewed