IND vs SL: మ్యాచ్ తర్వాత రెచ్చిపోయిన ఫ్యాన్స్.. స్టేడియంలో కొట్టుకున్న ఇండియా-శ్రీలంక ఫ్యాన్స్ (వీడియో)

by Vinod kumar |
IND vs SL: మ్యాచ్ తర్వాత రెచ్చిపోయిన ఫ్యాన్స్.. స్టేడియంలో కొట్టుకున్న ఇండియా-శ్రీలంక ఫ్యాన్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన సూపర్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ విజయంతో భారత్ ఫైనల్ బెర్త్ కూడా ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గొప్పగా పోరాడింది. ముందుగా బంతితో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూల్చిన శ్రీలంక.. ఆ తర్వాత లక్ష్యచేధనలో బ్యాట్‌తో పోరాడింది. ఓ దశలో విజయం దిశగా దూసుకెళ్లింది. కానీ అనుభవం కలిగిన భారత్ బౌలర్ల ముందు విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే శ్రీలంక అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విజయాన్ని ఆస్వాదిస్తున్న భారత అభిమానులను చూసి తట్టుకోలేకపోయారు. ఓ శ్రీలంక అభిమాని.. ఇండియన్ ఫ్యాన్‌పై దాడి చేసి పిడి గుద్దులు గుద్దాడు. భారత అభిమాని కూడా ఎదురు దాడికి దిగాడు. అక్కడే ఉన్న పక్కనవారు ఇద్దర్నీ విడదీసారు. అయితే మహిళా పోలీస్ సమక్షంలోనే ఈ గొడవ జరగడం విశేషం.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(61 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్(44 బంతుల్లో 2 ఫోర్లతో 39) పర్వాలేదనిపించారు. చివర్లో అక్షర్ పటేల్(26, సిరాజ్(5 నాటౌట్) విలువైన రన్స్ చేశాడు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే(5/40) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. చరిత్ అసలంక (4/14) నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహీశ్ తీక్షణకు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ధనంజయ డిసిల్వా( 66 బంతుల్లో 5 ఫోర్లతో 41), దునిత్ వెల్లలాగే(46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/43) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ తీశారు.

Advertisement

Next Story

Most Viewed