వన్డే ఫార్మాట్‌లో సంచలన రికార్డు.. భారీ తేడాతో విజయం

by Vinod kumar |
వన్డే ఫార్మాట్‌లో సంచలన రికార్డు.. భారీ తేడాతో విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: టొరొంటో వేదికగా నిన్న జరిగిన యూఎస్‌ఏ అండర్‌-19 మ్యాచ్‌లో పెను సంచలనం నమోదైంది. యూఎస్‌ఏ అండర్‌-19 జట్టు అర్జెంటీనా యువ జట్టుపై 450 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది. ఐసీసీ అండర్‌-19 పురుషుల వరల్డ్‌కప్‌ అమెరికా క్వాలిఫయర్‌ పోటీల్లో ఈ రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఎస్‌ఏ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 515 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. అండర్‌-19 క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోర్‌ కావడం విశేషం.

2002లో ఆస్ట్రేలియా అండర్‌-19 టీమ్‌.. కెన్యాపై చేసిన 480 పరుగులే ఈ మ్యాచ్‌కు ముందు వరకు అత్యధిక టీమ్‌ స్కోర్‌గా రికార్డుల్లో ఉండింది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ.. ఆసీస్‌ రికార్డును బ్రేక్‌ చేసి, అండర్‌-19 వన్డే ఫార్మాట్‌లో 500 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. యూఎస్‌ఏ నిర్ధేశించిన 516 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అర్జెంటీనా.. పేసర్‌ ఆరిన్‌ నాదకర్ణి (6) ధాటికి 65 పరుగులకే కుప్పకూలి, 450 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. అండర్‌-19 క్రికెట్‌ వన్డే ఫార్మాట్‌లో ఇదే అతి భారీ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యధిక టీమ్‌ స్కోర్‌ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు టీమ్‌ రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది.

Advertisement

Next Story

Most Viewed