సొంత పార్టీపైనే విమర్శనాస్త్రాలు.. ఇంతకీ ధర్మపురి అర్వింద్ టార్గెట్ చేసింది ఎవరిని?

by Gantepaka Srikanth |
సొంత పార్టీపైనే విమర్శనాస్త్రాలు.. ఇంతకీ ధర్మపురి అర్వింద్ టార్గెట్ చేసింది ఎవరిని?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాషాయ పార్టీలో సొంత నేతల వ్యాఖ్యలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. మొన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌‌లో సమావేశం నిర్వహించి ప్రెస్‌మీట్లపై ఆంక్షలు అనే విమర్శలకు మరింత బలాన్ని చేకూర్చగా.. ఇటీవల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త దుమారాన్ని రేపాయి. జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో 48 సీట్లు సాధించిన కాషాయ పార్టీకి.. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఆశించిన స్థానాలు రాకపోవడానికి కారణమేంటి? అని సొంత పార్టీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. ఇది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యల వెనుకు ఉన్న ఆంతర్యమేంటని నాయకులు, కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. ఆయన ఎవరిని టార్గెట్ చేసి కామెంట్స్ చేశారని చర్చించుకుంటున్నారు.

సభ్యత్వాల టార్గెట్ కోసం నానా తంటాలు..

తెలంగాణలో బీజేపీ సభ్యత్వాల టార్గెట్ రీచ్ అయ్యేందుకు నానా తంటాలు పడుతోంది. ఈ ఇబ్బందులకు తోడు నేతల వ్యాఖ్యలతో పార్టీ తర్జనభర్జన పడుతోంది. ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలకు అర్థాలేంటనేది పొలిటికల్ సర్కిల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ గెలుపోటముల సమీక్షలు అంతర్గతంగా చర్చించాలి కానీ లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు ఎందుకు వేయలేదో రాష్ట్ర నాయకత్వం ‌హోల్‌సేల్‌గా థింక్ చేయాలంటూ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవని చర్చ కొనసాగుతోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనుకుని ధీమాగా ఉన్న సమయంలో 8 అసెంబ్లీ స్థానాలకే ఎందుకు పరిమితమయ్యామో ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ అర్వింద్ వ్యాఖ్యానించడం పార్టీలో దుమారమే రేపింది. ఆయన అక్కడితే ఆగకుండా దీనికి బాధ్యులెవరో తేల్చాలంటూ ప్రశ్నించారు. ఈ పరోక్ష వ్యాఖ్యలు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడెందుకు తెరపైకి వచ్చాయని చర్చ జరుగుతోంది.

ఎవరైనా కావాలనే మాట్లాడించారా...? లేక ఆయనే మాట్లాడాల్సి వచ్చిందా..? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 48 కార్పొరేటర్లను బీజేపీ గెలుచుకుంది. కానీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. ఇదిలా ఉండగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీగా సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో అర్వింద్ ఆయన్నే టార్గెట్ చేసి ఉంటారన్న అనుమానాలను నాయకులు, శ్రేణులు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత నాయకత్వం సమన్వయలోపం వల్లే పార్టీకి రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కడంలేదని ఎంపీ భావించి ఉంటారని చర్చించుకుంటున్నారు.

అధ్యక్ష పదవి కోసమేనా..?

త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఎంపీ అర్వింద్ సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో పదవి ఆశిస్తున్నారు. స్టేట్ ప్రెసిడెంట్‌గా బండి సంజయ్‌‌ని మార్చిన సమయంలోనూ ప్రయత్నాలు చేశారు. కానీ పార్టీ కిషన్ రెడ్డిని నియమించింది. దీంతో ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. త్వరలో కొత్త స్టేట్ ప్రెసిడెంట్ నియామకం జరిగే చాన్స్ ఉండటంతో ఆయనతోపాటు ఇతర నేతలు సైతం పదవి ఆశిస్తున్నారు. అయితే.. తాజాగా అర్వింద్ పలు అంశాలపై ఓపెన్ అవ్వడం వార్తల్లో నిలిచేందుకేనా? అని పార్టీలో ఒక వర్గం జోరుగా చర్చించుకుంటోంది. మరి ఆయన చెప్పినట్లు బీజేపీ నేతలు రిటైల్ థింకింగ్ వదిలేసి హోల్ సేల్ థింకింగ్ చేస్తారా? ఆత్మపరిశీలన చేసుకుంటారా? లేదా? అనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed