US Open Super 300: యూఎస్ ఓపెన్‌లో సింధు, లక్ష్యసేన్ శుభారంభం

by Vinod kumar |
US Open Super 300: యూఎస్ ఓపెన్‌లో సింధు, లక్ష్యసేన్ శుభారంభం
X

కౌన్సిల్ బ్లఫ్స్ : యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ శుభారంభం చేశారు. గురువారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21-15, 21-10 తేడాతో అమెరికా క్రీడాకారిణి దిశా గుప్తా‌ను చిత్తు చేసింది. రెండు గేముల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 27 నిమిషాల్లోనే ప్రత్యర్థి కథ ముగించింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదుర్కొన్నప్పటికీ 11-11తో స్కోర్లు సమమైన తర్వాత సింధుకు అడ్డులేకుండా పోయింది.

ఇక, రెండో గేమ్‌లో సింధుదే పూర్తి హవా. దాంతె వరుసగా రెండు గేమ్‌లను గెలుచుకున్న సింధు సునాయాసంగా రెండో రౌండ్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో రుత్విక శివాని 14-21, 11-21 తేడాతో చైనీస్ తైపీ షట్లర్ లిన్ హ్సియాంగ్ టి చేతిలో ఓడి తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది.

మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ సైతం రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్‌లో ఫిన్‌లాండ్ ప్లేయర్ కల్లె కోల్జోనెన్‌పై 21-8, 21-16 తేడాతో విజయం సాధించాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్న అతను.. రెండో గేమ్‌లో కాస్త శ్రమించాల్సి వచ్చింది. ఈ నెలలోనే లక్ష్యసేన్ కెనడా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. మరో మ్యాచ్‌లో భారత యువ షట్లర్ శంకర్ సుబ్రమణియన్ సంచలన ప్రదర్శన చేశాడు.

తొలి రౌండ్‌లో 8వ సీడ్, ఐర్లాండ్‌ ఆటగాడు నాట్ న్గుయెన్‌ను 21-11, 21-16 తేడాతో ఓడించి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. మరో మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు సాయి ప్రణీత్ 21-16, 14-21, 19-21 తేడాతో 2వ సీడ్, చైనా ఆటగాడు లి సి ఫెంగ్‌ చేతిలో పోరాడి ఓడి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు.

Advertisement

Next Story