యువ భారత్ హ్యాట్రిక్.. అండర్-19 వరల్డ్ కప్‌లో సూపర్-6 రౌండ్‌కు క్వాలిఫై

by Harish |
యువ భారత్ హ్యాట్రిక్.. అండర్-19 వరల్డ్ కప్‌లో సూపర్-6 రౌండ్‌కు క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్‌లో భారత యువ జట్టు అదరగొడుతున్నది. ఏకపక్ష విజయాలతో జోరు మీద ఉన్నది. బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లను చిత్తు చేసిన యువ భారత్.. చివరి గ్రూపు మ్యాచ్‌లో అమెరికాను చిత్తుగా ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. దీంతో గ్రూపు-ఏలో టాప్ పొజిషన్‌లో నిలిచి సూపర్-6 రౌండ్‌కు అర్హత సాధించింది.

బ్లూమ్‌ఫోంటీన్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాపై 201 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 326 పరుగులు చేసింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్(25) స్వల్ప స్కోరుకే అవుటవ్వగా.. మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి(108) సెంచరీతో కదం తొక్కాడు. అతనితోపాటు ముషీర్ ఖాన్(73) సైతం సత్తాచాటాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యం జోడించింది. కెప్టెన్ ఉదయ్ సహారన్(35), సచిన్ దాస్(20) విలువైన పరుగులు చేయగా.. ప్రియాన్ష్(27 నాటౌట్), తెలుగు కుర్రాడు అవనీశ్(12 నాటౌట్) అజేయంగా నిలిచారు. అనంతరం 327 పరుగుల లక్ష్య ఛేదనలో అమెరికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. ఉత్కర్ష్ శ్రీవాస్తవ(40) పర్వాలేదనిపించగా.. మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్ నమన్ తివారి(4/20) సత్తాచాటాడు. రాజ్ లింబాని, సౌమీ పాండే, మురుగన్ అభిషేక్, ప్రియాన్ష్‌లకు చెరో వికెట్ దక్కింది. సూపర్-6 రౌండ్ గ్రూపు-1 మ్యాచ్‌లో భారత్ మంగళవారం న్యూజిలాండ్‌తో తలపడనుంది.

సంక్షిప్త స్కోరుబోర్డు

భారత్ అండర్-19 ఇన్నింగ్స్ : 326/5(50 ఓవర్లు)

(అర్షిన్ కులకర్ణి 108, ముషీర్ ఖాన్ 73, ఉదయ్ సహారన్ 35, అతీంద్ర సుబ్రమణియన్ 2/45)

అమెరికా అండర్-19 ఇన్నింగ్స్ : 125/8(50 ఓవర్లు)

(ఉత్కర్ష్ శ్రీవాస్తవ 40, అమోఘ్ అరెపల్లి 27, నమన్ తివారి 4/20)

Advertisement

Next Story

Most Viewed