Rohit Sharma: 'నంబర్‌ వన్‌గా ఎదిగేందుకు వారెంతో శ్రమించారు'

by Vinod kumar |
Rohit Sharma: నంబర్‌ వన్‌గా ఎదిగేందుకు వారెంతో శ్రమించారు
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌పై రోహిత్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. బాబర్‌ సేనతో మ్యాచ్‌కు ముందు పల్లెకెలెలో మీడియాతో మాట్లాడాడు. వన్డేల్లో ప్రపంచ నంబర్‌ వన్‌గా అవతరించేందుకు ఆ జట్టెంతో కష్టపడిందని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నాడు. 'ఆసియాకప్‌లో ఆరు మంచి జట్లు పోటీపడుతున్నాయి. తమదైన రోజున ఎవరు ఎవరినైనా ఓడించగలరు. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకుంటేనే మేం గెలవగలం. అవే మాకు సాయపడతాయి. పాకిస్థాన్‌ ఈ మధ్యన టీ20, వన్డేల్లో మెరుగ్గా ఆడుతోంది. ప్రపంచ నంబర్‌ వన్‌గా ఎదిగేందుకు వారెంతో శ్రమించారు. ఆదివారం వారితో మాకు గొప్ప సవాల్‌ ఎదురవ్వనుంది' అని రోహిత్‌ శర్మ అన్నాడు.

ఆసియాకప్‌ 2023లో భాగంగా పల్లెకెలె వేదికగా శనివారం భారత్‌, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. ఇప్పటికే పాక్ పసికూన నేపాల్‌ను 238 పరుగుల తేడాతో ఓడించింది. అయితే చివరి ఐదు వన్డేల్లో బాబర్‌ సేనపై టీమ్‌ ఇండియాదే ఆధిపత్యం. 1984లో మొదలైన ఆసియా కప్‌లో ఇప్పటివరకూ భారత్-పాక్‌లు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో ఏడు మ్యాచ్‌లలో టీమిండియా నెగ్గగా.. ఐదు మ్యాచ్‌లను పాక్ గెలిచింది.

Advertisement

Next Story