CPL 2023: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి 'రెడ్‌ కార్డ్‌'..

by Vinod kumar |   ( Updated:2023-08-29 12:13:38.0  )
CPL 2023: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి రెడ్‌ కార్డ్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌లో భాగంగా సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రికెట్‌లో తొలిసారి రెడ్‌ కార్డ్‌ జారీ చేయబడింది. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఆటగాడు సునీల్‌ నరైన్‌కు అంపైర్‌ రెడ్‌ కార్డ్‌ చూపించి, స్టేడియాన్ని వీడాల్సిందిగా ఆదేశించాడు. దీంతో రెడ్‌ కార్డ్‌ కారణంగా మైదానం వీడిన తొలి క్రికెటర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. స్లో ఓవర్‌రేట్‌ కారణంగా జట్టులో ఎవరో ఒక ఆటగాడు మైదానం వీడాల్సి ఉండటంతో.. అప్పటికే తన కోటా ఓవర్లు పూర్తి చేసుకున్న సునీల్‌ నరైన్‌ పేరును ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ కీరన్‌ పోలార్డ్‌ ప్రతిపాదించగా.. ఫీల్డ్‌ అంపైర్‌ నరైన్‌కు రెడ్‌ కార్డ్‌ చూపించాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రస్తుత ఎడిషన్‌లోనే తొలిసారి క్రికెట్‌లో ఈ రెడ్‌ కార్డ్‌ రూల్‌ అమల్లోకి వచ్చింది.

ఓ ఇన్నింగ్స్‌లో 3 సార్లు నిర్ధేశిత సమయంలో ఓవర్‌ను పూర్తి చేయకపోతే, రెడ్‌ కార్డ్‌ను జారీ చేస్తారు. తొలిసారి నిర్ధేశిత సమయంలో ఓవర్‌ను పూర్తి చేయకపోతే ఓ ఫీల్డర్‌ను (ఐదో ఫీల్డర్‌), రెండో సారి అదే రిపీటైతే మరో ఫీల్డర్‌ను (ఆరో ఫీల్డర్‌) 20 యార్డ్స్‌ సర్కిల్‌లోకి తీసుకరావాల్సి ఉంటుంది. ఇక ఇదే మూడోసారి రిపీటైతే మాత్రం జట్టులోకి ఓ ఆటగాడు మైదానాన్ని వీడాల్సి ఉంటుంది. నిన్నటి మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ 17, 18, 19వ ఓవర్లను కోటా సమయంలో పూర్తి చేయకపోవడంతో అంపైర్‌ ఆ జట్టులోని ఓ ఫీల్డర్‌ను మైదానం వీడాల్సిందిగా ఆదేశించాడు. దీంతో నైట్‌రైడర్స్‌ 10 మంది ఆటగాళ్లతోనే చివరి ఓవర్‌ కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌పై ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Advertisement

Next Story

Most Viewed