FIFA World Cup: ముద్దు వివాదం.. స్పెయిన్ ప్రధాని ఆగ్రహం..!

by Vinod kumar |
FIFA World Cup: ముద్దు వివాదం.. స్పెయిన్ ప్రధాని ఆగ్రహం..!
X

దిశ, వెబ్‌డెస్క్: స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్‌పై ఆ దేశ ప్రధాని పెడ్రో సాంఖెజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుబియాలెస్ చేసింది ఘోర తప్పిదమని, ఆయన చెప్పిన క్షమాపణలు సరిపోవని మండిపడ్డారు. ఫిఫా మహిళల ప్రపంచకప్‌ 2023‌ టైటిల్ స్పెయిన్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విజయ సంబరాల్లో భాగంగా స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్ చీఫ్‌ హద్దులు ధాటి ప్రవర్తించాడు. మెడల్స్ అందజేసే క్రమంలో స్పెయిన్ క్రీడాకారుణులకు ముద్దులు పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. గత ఆదివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0తో ఇంగ్లండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. తొలిసారి ఫిఫా మహిళల ప్రపంచకప్‌ను ముద్దాడింది. స్టార్‌ ప్లేయర్ అయిన జెన్నిఫర్ హెర్మోసో పెదాలను ముద్దాడిన రుబియాలెస్.. ఇతర క్రీడాకారిణుల చెంపలను కూడా కిస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ కావడంతో స్పెయిన్‌లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దాంతో తన తప్పిదాన్ని తెలుసుకున్న లూయిస్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు.

ప్రపంచకప్ గెలిచామనే సంతోషంలో ఎలాంటి దురుద్దేశం లేకుండా చేసిన పనని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. 'నేను చేసింది తప్పు కావొచ్చు. దానిని ఒప్పుకుంటున్నా. అంతు లేని సంతోష సమయంలో ఎలాంటి దురుద్దేశం లేకుండా చేసిన పని' అని తెలిపాడు. లూయిస్ రుబియాలెస్ చేసిన పనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవ్వగా.. ఈ ఘటనపై ప్రధాని పెడ్రో స్పందించాడు. లూయిస్ రుబియాలెస్ ఘోర తప్పిదం చేశాడని తెలిపాడు. 'రుబియాలెస్ చెప్పిన క్షమాపణలు సరిపోవు. ఆ అభ్యంతరకర ప్రవర్తనపై మరింత స్పష్టత ఇవ్వాలి' అని అన్నారు. అయితే ఫెడరేషన్‌ స్వతంత్రంగా పనిచేస్తుందని, దాని ప్రెసిడెంట్‌ను నియమించే, తొలగించే అధికారం స్పెయిన్‌ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మరోవైపు స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్ష పదవి నుంచి రుబియాలెస్‌ను తప్పించాలని.. అతనే స్వయంగా రాజీనామా చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

Advertisement

Next Story