పాక్ కెప్టెన్‌పై స్మృతి మంధానా ప్రశంసల వర్షం

by Sathputhe Rajesh |
పాక్ కెప్టెన్‌పై స్మృతి మంధానా ప్రశంసల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ మహిళా జట్టు కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్‌ యావత్ మహిళా క్రీడాకారులకు ఉదాహరణగా నిలిచిపోయారంటూ భారత మహిళా క్రికెట్ స్టార్ ఓపెనింగ్ బ్యాటర్ స్మృతి మంధానా ప్రశంసించింది. బిడ్డకు జన్మనిచ్చిన ఆరు నెలలలోపే అంతర్జాతీయ క్రికెట్‌ మైదానంలోకి అడుగుపెట్టడం ద్వారా ప్రపంచ క్రీడాకారిణులందరికీ ఆమె ఆదర్శాన్ని నెలకొల్పారని మంధానా పాక్ మహిళా జట్టు కెప్టెన్‌ను ప్రస్తుతించారు. మంధానా ట్వీట్ క్షణాల్లో వైరల్ కాగా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తక్షణం స్పందిస్తూ క్రికెట్‌కు సరిహద్దులు మైదానంలోనే ఉంటాయని, మైదానం వెలుపల అన్ని సరిహద్దులూ చెరిగిపోతాయంటూ వ్యాఖ్యానించాడు.

భారత్, పాక్ జట్ల మధ్య మహిళల ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ తన ప్రత్యర్థి పాక్ జట్టుని యధాప్రకారమే 107 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ప్రత్యర్థి జట్టును మైదానంలో మాత్రమే ఓడించిన భారత్ జట్టు క్రీడాకారిణులు కొందరు మరూఫ్ కుమార్తె ఫాతిమాతో ఆడుకుంటూ సరదాగా గడిపారు. ఆ పసిపాపతో కలిసి వారు గడిపిన క్షణాలను చిత్రాలు, వీడియోల ద్వారా భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా షేర్ చేయడంతో నెటిజన్లతో వెటరన్ క్రికెటర్లు కూడా కదిలిపోవడం విశేషం. ఈ సందర్భంగా స్మృతి మంధానా పోస్ట్ చేసిన ట్వీట్ లక్షల సంఖ్యలో హిట్లను సాధించింది. బిడ్డకు జన్మనిచ్చిన ఆరు నెలలలోపే అంతర్జాతీయ క్రికెట్లో ఆడటం స్ఫూర్తిదాయకం. ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారిణులందరికీ బిస్మార్క్ మరూఫ్ ఒక ఉదాహరణగా నిలిచారు అంటూ మంధానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించింది.

బేబీ ఫాతిమాకు భారత్ నుంచి ప్రేమను పంచిపెడుతున్నాం. ఎడమ చేతి బ్యాటర్లు ప్రత్యేకమైనవారు కాబట్టి ఆమె కూడా మీలాగే బ్యాట్ చేతపడుతుందని ఆశిస్తున్నాను మరూఫ్ అంటా మంధానా చేసిన వ్యాఖ్య క్రీడాభిమానులను కదిలిస్తోంది. భారత జట్టు వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, మంధానా, షఫాలి వర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, రిచా ఘోష్ మరూప్ భుజాలపై ఉన్న పాప ఫాతిమాను నవ్విస్తూ ఆడుకుంటున్న ఫోటోలను మంథానా తన ఇన్‌స్టాగ్రాం లో పోస్ట్ చేసింది. మ్యాచ్ అనంతరం ఐసీసీ కూడా ఈ ఘటనపై ట్వీట్ చేసింది. భారత్, పాకిస్తాన్ క్రికెట్ స్ఫూర్తి నుంచి చిన్నారి ఫాతిమా తన తొలి పాఠం నేర్చుకుంది అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసిస్తూ వ్యాఖ్య చేశాడు.

ఎంత గొప్ప క్షణమిది. క్రికెట్‌కు మైదానం లోనే సరిహద్దులు ఉంటాయి. కాని మైదానం వెలుపల అన్ని సరిహద్దులూ చెరిగిపోతాయి. క్రీడ అనేది బంధాలను ఐక్యపరుస్తుంది అంటూ సచిన్ పోస్ట్ చేసిన ట్వీట్ కూడా వైరల్ అయింది. భారత్‌తో మ్యాచ్ జరగడానికి ముందు మౌంట్ మౌంగానుయి లోని క్రికెట్ మైదానంలోకి ఆరునెలల పసిపాపతో ప్రవేశించిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ ఫోటో సోషల్ మీడియాను విశేషంగా ఆకట్టుకుంది.

30 సంవత్సరాల వయసు కలిగిన మరూప్ న్యూజిలాండ్‌కి తన ఆరునెలల పసిపాపతో కలసి ప్రయాణించి వచ్చింది. ఆమె తల్లి కూడా తనకు తోడుగా వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మెటర్నిటీ రూల్ ప్రకారం తన పసిబిడ్డ ఆలనా పాలనా చూసుకోవడానికి తల్లికి సపోర్ట్ పర్సన్‌ని తోడుగా తీసుకుని రావచ్చు. ఆమెకు అయ్యే ఖర్చులను పాక్ క్రికెట్ బోర్డు, ప్లేయర్ సమానంగా భరిస్తాయి. తొలి మ్యాచ్‌లో భారత మహిళా జట్టు గెలుపుకంటే పాక్ కెప్టెన్ మరూఫ్ పసిబిడ్డతో భారత మహిళా జట్టు సభ్యుల కేరింతలకే ఎక్కువ ప్రాచుర్యం లభించడం విశేషం.

Advertisement

Next Story