అఫ్గాన్‌ను కూల్చేసిన జయసూర్య.. ఏకైక టెస్టు శ్రీలంకదే

by Harish |
అఫ్గాన్‌ను కూల్చేసిన జయసూర్య.. ఏకైక టెస్టు శ్రీలంకదే
X

దిశ, స్పోర్ట్స్ : ఆఫ్ఘనిస్తాన్‌‌పై ఏకైక టెస్టు మ్యాచ్‌ను ఆతిథ్య శ్రీలంక గెలుచుకుంది. సోమవారం కొలంబోలో జరిగిన టెస్టులో 10 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 56 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 199/1తో భారీ స్కోరు చేసేలా కనిపించిన అఫ్గాన్‌ను శ్రీలంక బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ముఖ్యంగా ప్రభాత్ జయసూర్య(5/107) ఐదు వికెట్ల ప్రదర్శనతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అసితా ఫెర్నాండో(3/63), రజిత(2/59) సైతం రాణించారు. దీంతో ఆదివారం సెంచరీతో చెలరేగిన ఇబ్రహీం జద్రాన్(114)తోపాటు రెహమత్ షా(54) సోమవారం ఆరంభంలోనే వికెట్లు పారేసుకున్నారు. నసీర్ జమాల్(41) పర్వాలేదనిపించాడు. కేవలం 97 పరుగుల వ్యవధిలోనే 9 వికెట్లు కోల్పోయిన అఫ్గాన్ 296 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. అంతకుముందు అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేయగా.. శ్రీలంక 439 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగుల ఆధిక్యం పోగా శ్రీలంక లక్ష్యం 56 పరుగులే. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఓపెనర్లు కరుణరత్నే(32 నాటౌట్), నిషాన్ మదుశంక(22 నాటౌట్) ధాటిగా ఆడి 7.2 ఓవర్లలోనే చేధించారు.

Advertisement

Next Story

Most Viewed