బుమ్రా సర్జరీ సక్సెస్.. శ్రేయస్ అయ్యర్‌పై బోర్డు కీలక అప్‌డేట్

by Vinod kumar |   ( Updated:2023-04-15 13:25:24.0  )
బుమ్రా సర్జరీ సక్సెస్.. శ్రేయస్ అయ్యర్‌పై బోర్డు కీలక అప్‌డేట్
X

న్యూఢిల్లీ: చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా న్యూజిలాండ్‌లో విజయవంతంగా సర్జరీ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం వెల్లడించింది. ‘బుమ్రాకు న్యూజిలాండ్‌లో సర్జరీ జరిగింది. స్పెషలిస్టుల సూచన మేరకు అతను ఆరువారాలపాటు రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉండనున్నాడు. ఈ క్రమంలో బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో శిక్షణ మొదలుపెట్టనున్నాడు’ అని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, శ్రేయస్ అయ్యర్‌పై కూడా బోర్డు కీలక అప్‌డేట్ ఇచ్చింది. కొంతకాలంగా అయ్యర్ సైతం వెన్నునొప్పితోనే బాధపడుతున్న విషయం తెలిసిందే. వచ్చే వారంలో అతని శస్త్ర చికిత్స జరగనుందని, అనంతరం అతను ఎన్‌సీఏకు చేరుకుంటాడని తెలిపింది. అయ్యర్ ఇంగ్లాండ్‌లో సర్జరీ చేయించుకోబోతున్నట్టు తెలుస్తుంది.

బుమ్రా, అయ్యర్ వెన్నునొప్పితో ఐపీఎల్-16 పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. జూన్‌లో జరగబోయే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌కు వీరిద్దరూ జట్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే, ఆర్సీబీ యువ బ్యాటర్ రజత్ పటిదార్ ఎడమ కాలు మడమ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. పటిదార్ కూడా అయ్యర్‌తోపాటు ఇంగ్లాండ్ సర్జరీ చేయించుకోబోతున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘నేషనల్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో పటిదార్ లేకపోయినప్పటికీ బోర్డు అతన్ని సర్జరీ కోసం పంపించనుంది. టార్గెట్ ఆటగాళ్లలో అతను కూడా ఒకడు. అతనికి బోర్డు బెస్ట్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలనుకుంటున్నది’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Also Read..

ఐపీఎల్లో సెంచరీ కొట్టిన ఇంగ్లాండ్ ప్లేయర్లు వీళ్లే..!

Advertisement

Next Story

Most Viewed