మను, నేను అరగంట మాత్రమే ప్రాక్టీస్ చేసేవాళ్లం : సరబ్‌జోత్ సింగ్

by Harish |
మను, నేను అరగంట మాత్రమే ప్రాక్టీస్ చేసేవాళ్లం : సరబ్‌జోత్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్లు మను బాకర్, సరబ్‌జోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. మిక్స్‌డ్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి మెడల్ అందించి చరిత్ర సృష్టించారు. అయితే, ఒలింపిక్స్ కోసం మను, సరబ్‌జోత్ కేవలం అరగంట మాత్రమే ప్రాక్టీస్ చేసేవాళ్లట. ఈ విషయాన్ని సరబ్‌జోతే చెప్పాడు. తాజాగా ఓ జాతీయాకు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను పలు విషయాలు వెల్లడించాడు. ‘వ్యక్తిగతంగా నేను 9 గంటలకు ప్రాక్టీస్ చేసేవాడిని. మనుది 12 గంటలకు. మిక్స్‌డ్ సెషన్ కోసం మేము 30 నిమిషాలే ప్రాక్టీస్ చేసేవాళ్లం. మా మధ్య సంభాషణ కూడా తక్కువే. ఒక్కటే మాట్లాడుకునేవాళ్లం. 100 శాతం ఇవ్వాలని అనుకునేవాళ్లం. అయితే, కొన్నిసార్లు మాత్రం సరదాగా ఉండేవాళ్లం. నేను ఆమెను ఎగతాళి చేస్తే.. ఆమె నన్ను ఆటపట్టించేది.’ అని చెప్పాడు.

అలాగే, మను, సరబ్‌జోత్ మెడల్ గెలిచిన ఈవెంట్‌లోనే తుర్కియే జోడీ యూసఫ్ డికెక్-సెవ్వల్ ఇలాదా తర్హాన్ రజతం సాధించింది. 51 ఏళ్ల వయసులో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న యూసుఫ్ ఏమాత్రం హడావిడి లేకుండా పతకాన్ని కొల్లగొట్టాడు. సన్‌గ్లాసెస్, ఇయర్ ప్రొటక్టర్లు వాడకుండా అతను పోటీలో పాల్గొన్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. యూసఫ్‌ను సరబ్‌జోత్ 2011 నుంచి ఫాలో అవుతున్నాడట. ‘యూసుఫ్ వీడియోలను 2011 నుంచి చూస్తున్నా. నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ అతనితో సమంగా పోటీ ఇవ్వలేకపోతున్నా. అతన్ని కలిసే అవకాశం వస్తే యూసుఫ్ ఏం తింటాడో అడుగుతా.’ అని చెప్పుకొచ్చాడు.

అలాగే, తన పిస్టల్‌పై చెక్కబడిన SSINGH30 గురించి రివీల్ చేశాడు. ‘నా పిస్టల్‌కు పేరు పెట్టలేదు. కానీ, గతేడాది ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తర్వాత SSINGH30 అని రాశాను. సెప్టెంబర్ 30న బంగారు పతకం గెలిచాను. కాబట్టి, నా పేరు, 30వ తేదీని కలిపి అలా రాశాను.’ అని సరబ్‌జోత్ వివరించాడు.

Advertisement

Next Story

Most Viewed