జింబాబ్వే టూరుకు భారత జట్టులో మార్పులు.. కేకేఆర్ బౌలర్‌కు చాన్స్

by Harish |
జింబాబ్వే టూరుకు భారత జట్టులో మార్పులు.. కేకేఆర్ బౌలర్‌కు చాన్స్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 సిరీస్ కోసం భారత జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 6న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ టూరుకు గిల్ కెప్టెన్సీలో బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. తాజాగా తొలి రెండు టీ20లకు సంబంధించి జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. సంజూ శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైశ్వాల్ స్థానాల్లో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, బౌలర్ హర్షిత్ రాణాలను జట్టులోకి తీసుకున్నట్టు బీసీసీఐ మంగళవారం వెల్లడించింది.

టీ20 ప్రపంచకప్ చాంపియన్ భారత జట్టు ఇంకా భారత్‌కు చేరుకోలేదు. బెరిల్ హారికేన్ కారణంగా బార్బడోస్‌లోనే ఉండిపోయింది. ప్రపంచకప్ జట్టు సభ్యులైన శాంసన్, దూబె, జైశ్వాల్ కూడా అక్కడే చిక్కుకుపోయారు. ఆ ముగ్గురు ప్రపంచకప్ విన్నింగ్ జట్టుతో కలిసి భారత్‌కు చేరుకున్న తర్వాత హరారేకు వెళ్తారని బీసీసీఐ పేర్కొంది. దీంతో ఆ ముగ్గురు తొలి రెండు టీ20లకు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో వారి స్థానాల్లో సాయి సుదర్శన్, జితేశ్, హర్షిత్ రాణాలను తీసుకున్నారు. మూడో టీ20కి నాటికి వారు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సాయి సుదర్శన్, జితేశ్ ఇప్పటికే భారత్ తరపున అరంగేట్రం చేయగా.. హర్షిత్ రాణా తొలిసారిగా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాణా సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 19 వికెట్లు తీసిన అతను కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

భారత జట్టు(తొలి రెండు టీ20లకు) : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా.

Next Story