Sachin Tendulkar: సచిన్‌కు మరో గౌరవం.. వాంఖెడేలో నిలువెత్తు విగ్రహం..

by Vinod kumar |   ( Updated:2023-10-31 14:57:07.0  )
Sachin Tendulkar: సచిన్‌కు మరో గౌరవం.. వాంఖెడేలో నిలువెత్తు విగ్రహం..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్‌ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. తనకు ఎంతో ఇష్టమైన, తన కెరీర్‌లో ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ నిలువెత్తు విగ్రహాన్ని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతిష్టించింది. ఈ విగ్రహాన్ని బుధవారం (నవంబర్‌ 01న) ఆవిష్కరించనున్నారు. సచిన్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, బీసీసీఐ సెక్రటరీ జై షాలతో పాటు ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఎ) ప్రతినిధులు హాజరుకానున్నారు.

వాంఖేడే స్డేడియంలో సచిన్‌ టెండూల్కర్‌ స్టాండ్‌కు ఆనుకుని ఉండే ఈ విగ్రహాన్ని ఎంసీఎ ఈ ఏడాది లిటిల్‌ మాస్టర్‌ 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాని నిర్వహిస్తు్న్నది. కాగా వన్డే వరల్డ్‌ కప్‌‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌ ఆడేందుకు ముంబై చేరుకుని వాంఖెడేలో ప్రాక్టీస్‌ చేస్తున్న భారత క్రికెటర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది. అహ్మద్‌నగర్‌కు చెందిన ప్రమోద్‌ కాంబ్లీ ఈ విగ్రహాన్ని సచిన్‌ లెగసీకి నివాళిగా తీర్చిదిద్దినట్టు చెప్పాడు. కాగా సచిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ నుంచి తప్పుకున్న సుమారు పదేండ్ల తర్వాత ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తుండటం గమనార్హం. 2013లో సచిన్‌.. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా నవంబర్‌ 14న ఆఖరి టెస్టు ఆడారు.

Advertisement

Next Story

Most Viewed