రోహిత్ జైత్రయాత్ర.. బంగ్లాతో టెస్టు సిరీస్ టీమిండియా వశం!

by saikumar |
రోహిత్ జైత్రయాత్ర.. బంగ్లాతో టెస్టు సిరీస్ టీమిండియా వశం!
X

దిశ, స్పోర్ట్స్ : ఇటీవల పాకిస్తాన్‌ను చిత్తు చేసి జోరు మీదున్న బంగ్లాదేశ్ జట్టును టీమిండియా మరోసారి మట్టికరిపించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుని ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కాన్పూర్ వేదికగా సాగిన టెస్టు సిరీస్‌కు రెండ్రోజుల పాటు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో ఆ రెండు రోజులు ఒక్క బంతి కూడా పడలేదు. తొలి రోజు కేవలం 35 ఓవర్లే పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఫలితం ఊహించడం చాలా కష్టమే. కానీ, ఎవరూ ఊహించని విధంగా భారత్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. బంగ్లాను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్‌ చేసింది. కేవలం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 3 వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (8), గిల్ (6) త్వరగానే విఫలమైనా.. యశస్వి జైస్వాల్ (51), విరాట్ కోహ్లీ (29) (నాటౌట్) అద్భుతంగా రాణించారు. విజయానికి మరో3 పరుగులు అవసరమనగా.. జైస్వాల్ భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రిషభ్‌ పంత్‌తో ఫోర్ కొట్టి (నాటౌట్) మరో వికెట్‌ పడకుండానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 285 డిక్లేర్..

రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 146 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. 107/3తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులు మాత్రమే చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 285/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా విధించిన 95 పరుగుల లక్ష్యాన్ని సులువుగా చేధించింది. దీంతో 2 టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో స్వదేశంలో వరుసగా 18వ సిరీస్‌ను గెలిచిన జట్టుగా భారత్‌ నిలిచింది. ఈ సిరీస్‌లో యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలవగా.. రవిచంద్రన్ అశ్విన్‌ ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును గెలుచుకున్నాడు.

100 పరుగులకే ఆలౌటైనా చాలు : రోహిత్

‘రెండో టెస్టులో తొలి రోజు ఆట మొదలవ్వగానే వరుణుడు మ్యాచ్‌కు అడ్డు తగిలాడు. ఆ తర్వాత రెండు రోజులు ఒక్క బంతి కూడా పడలేదు. నాలుగో రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందే ఎలా ముందుకెళ్లాలనే దాని గురించి చాలా ఆలోచించాం. వీలైనంత త్వరగా బంగ్లాను ఆలౌట్ చేసి తర్వాత బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలనుకున్నాం. ప్రత్యర్థి జట్టు ఎన్ని పరుగులు చేస్తుందనే దానిపై మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. బంగ్లాను తక్కువ పరుగులకు కట్టడి చేసి వీలైనంత ఎక్కువ రన్‌రేట్‌ ఉండేలా బ్యాటింగ్‌ చేయాలని ప్లాన్‌ చేసుకున్నాం. పిచ్‌ పెద్దగా హెల్ప్ చేయకపోయినా బౌలర్లు గొప్పగా రాణించారు. బ్యాటర్లు రిస్క్‌ తీసుకుని దూకుడుగా ఆడే క్రమంలో 100-150 పరుగులకు ఆలౌటైన పర్వాలేదనే మైండ్‌సెట్‌తో ఆడాం. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఈ రిస్క్‌ తీసుకున్నాం’ అని రోహిత్ శర్మ చెప్పాడు.

ముత్తయ్య రికార్డు సమం చేసిన అశ్విన్..

బంగ్లాతో జరిగిన రెండో టెస్టులో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలిచిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు అశ్విన్ 42 టెస్టు సిరీసుల్లో 11 అవార్డులు అందుకోగా.. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 61 టెస్టు సిరీసుల్లో 11 అవార్డులు అందుకున్నాడు. సౌతాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్ జాక్ కలీస్ 61 టెస్టు మ్యాచుల్లో 9 సార్లు ఈ అవార్డును అందుకున్నారు. టెస్టు సిరీసుల్లో తక్కువ మ్యాచుల్లో ఎక్కువ సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్న ఆటగాళ్లలో భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో నిలిచాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..

టీమిండియా వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకుంది. 2025 జూన్‌లో జరగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియా మొత్తం 8 టెస్టులు ఆడనుంది. ఇందులో మూడింట గెలిచినా ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అక్టోబర్‌ 16 నుంచి న్యూజిలాండ్‌తో 3 టెస్టుల సిరీస్‌, నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ (5 టెస్టులు) ప్రారంభంకానున్నాయి. స్వదేశంలో కివీస్‌తో జరిగే సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేస్తే.. ఆస్ట్రేలియా సిరీస్‌తో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. స్వదేశంలో టీమిండియాను ఓడించడం ఏ జట్టుకైనా కష్టం. మరోవైపు, ప్రస్తుతం కివీస్‌ ఆటగాళ్ల పరిస్థితి అస్సలు ఏం బాగోలేదు. శ్రీలంకతో జరిగిన 2 టెస్టుల సిరీస్‌లో ఆ జట్టు చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. కాగా, డబ్ల్యూటీసీలో భారత్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడగా 8 విజయాలు, 2 ఓటములు, ఒక డ్రా ఉన్నాయి. అంతేకాకుండా భారత్ (PCT 74.27) పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది.

ఆస్ట్రేలియాతో కానిది మనోళ్లు చేసి..

స్వదేశంలో రికార్డు స్థాయిలో టెస్టు సిరీస్‌ల‌ను కొల్లగొట్టిన జ‌ట్టుగా భారత్ చరిత్ర పుటల్లో నిలిచింది. 2013 నుంచి 2024 వరకు, 11 ఏండ్ల కాలంలో 18 సార్లు ప్రత్యర్థుల‌ను మట్టికరిపించింది. ఇక వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 జ‌ట్లలో ఒక‌టైన ఆస్ట్రేలియా వ‌ల్ల కూడా కాని రికార్డు తాజాగా భార‌త్ సొంత‌మైంది. ఆస్ట్రేలియా 1994 నుంచి 2000 మ‌ధ్య వ‌ర‌సగా 10 టెస్టు సిరీస్‌లు సాధించింది. ఒకప్పుడు ప్రమాద‌క‌ర జ‌ట్టుగా ఉన్న వెస్టిండీస్ 1976-1986 కాలంలో వ‌రుస‌గా 8 టెస్టు సిరీస్‌లతో రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్ జ‌ట్టు కూడా 2017-20లో సొంత‌గ‌డ్డపై వ‌రుస‌గా ఎనిమిది టెస్టు సిరీస్ విజ‌యాల‌ను నమోదు చేసింది. దీంతో ఎటూ చూసినా అగ్రజట్లను బీట్ చేసి ఇండియా టాప్ -1లో నిలిచింది.

180 విజయాలు.. నాలుగో జట్టుగా!

బంగ్లాతో జరిగిన రెండో టెస్టులో ప‌లు రికార్డులు బ‌ద్ధలు కొట్టిన టీమిండియా 180వ విజ‌యం న‌మోదు చేసింది. చెపాక్ టెస్టులో భారీ విజ‌యంతో ద‌క్షిణాఫ్రికా(179 టెస్టు) రికార్డు స‌మం చేసింది. ఇప్పుడు కాన్పూర్ విక్టరీతో రోహిత్ సేన 180వ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 414 విజ‌యాల‌తో అగ్రస్థానంలో ఉంది. ఇక ఇంగ్లండ్(397), వెస్టిండీస్‌(183)లు రెండు, మూడు స్థానాల్లో కొన‌సాగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed